నిత్య పెళ్లి కొడుకు పాస్‌పోర్టు రద్దు చేయించాలి

2 Aug, 2022 16:22 IST|Sakshi

నగరంపాలెం(గుంటూరు ఈస్ట్‌):  నిత్య పెళ్లికొడుకు పాస్‌పోర్టుని వెంటనే రద్దు చేయించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్‌)లో జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ దృష్టికి తీసుకువచ్చారు. వరుస వివాహాలతో పలువురి మహిళలను మోసగించిన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన కె.సతీష్‌బాబు అలియాస్‌ సత్యకుమార్‌ను గత గురువారం (జూలై 28) గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

సతీష్‌బాబుపై కోర్టులో కేసు జరుగుతుందని, అతనికి బెయిల్‌ మంజూరు చేస్తే విదేశానికి పారిపోయేందుకు అవకాశం ఉందని గుంటూరు నగరంలోని పాతగుంటూరు, శ్యామలానగర్‌కు చెందిన బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అతనికి బెయిల్‌ మంజూరు చేయవద్దని, అలాగే పాస్‌పోర్ట్‌ రద్దు చేయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

అతని వద్ద ఉన్న మరో లాప్‌ట్యాప్‌ను సీజ్‌ చేయలేదని తెలిపారు. అందులో విమాన టికెట్‌ ఉందని, ఏమాత్రం అతనికి బెయిల్‌ మంజూరైన, వెంటనే ఇక్కడి నుంచి పారిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఓ పోలీస్‌ అధికారి తీరు విమర్శలకు తావిస్తోందని, బాధితుల పక్షాన తెలియజేసే అదనపు సమాచారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. పోలీస్‌ అధికారిని పిలిచి మాట్లాడారు.  (క్లిక్: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!)

మరిన్ని వార్తలు