సర్వేశ్వర నేత్రం.. పరిష్కారం కానున్న భూ వివాదాలు

30 Sep, 2022 19:07 IST|Sakshi
సర్వేను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

జోరుగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ

డ్రోన్ల ద్వారా సరిహద్దుల గుర్తింపు

అక్టోబర్‌ 2 నుంచి క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌పుస్తకాల జారీ

సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళించి, రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష రీసర్వే పల్నాడు జిల్లాలో జోరుగా సాగుతోంది. చెదలు పట్టిన భూ రికార్డులు, ఎవరి భూములు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో అడ్డూఅదుపూలేని అక్రమాలు ఓ వైపు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు. వీటన్నింటికీ పరిష్కారం చూపి రైతులు భూవివాదాల నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం భూ స్వచ్ఛీకరణకు రీ సర్వే ద్వారా శ్రీకారం చుట్టింది. సర్వే తర్వాత ప్రతి రైతుకూ హద్దులు నిర్ణయించడంతోపాటు రాళ్లను పాతి ప్రత్యేక నంబర్లను కేటాయించనుంది. 

1904 తర్వాత... 
ఆంగ్లేయుల పాలనలో 1904లో చివరి సారిగా పూర్తి స్థాయిలో భూ సర్వే జరిపి రికార్డులు పొందుపరిచారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి సర్వే అండ్‌ రీ సెటిల్‌మెంట్‌ జరగాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో చేయలేదు. రెవెన్యూ సమస్యలకు చెక్‌ పెట్టేలా రికార్డుల స్వచ్ఛీకరణతోపాటు భూ రీసర్వేకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంతో దశాబ్దాలుగా ఉన్న భూ చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. 


డ్రోన్ల ద్వారా సర్వే.. రాళ్లతో హద్దులు 

సర్వే చేపడుతున్న  గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. రికార్డులను ప్రదర్శించి  అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో  మొదటగా డ్రోన్‌ కెమెరాలతో పాయింట్లను గుర్తిస్తున్నారు.  ఆ పాయింట్లు, రోవర్‌ ఆధారంగా పొలాల్లోకి దిగి మాన్యువల్‌ సర్వే చేపడుతున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు హద్దులు గుర్తించి రాళ్లు పాతుతున్నారు. ప్రస్తుతం 10 వేల హద్దు రాళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అక్టోబర్‌ 15నాటికి  పాతనున్నారు.  

26 గ్రామాల్లో కొత్త హక్కుపత్రాలు  
జిల్లాలో ల్యాండ్‌ అండ్‌ సర్వే అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు సమన్వయంతో సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. మొదటి దశలో జిల్లాలో 81 రెవెన్యూ గ్రామాల్లో 1,98,680 ఎకరాలను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1,38,024 ఎకరాల సర్వే పూర్తయింది. తొలివిడతగా 26 గ్రామాల్లోని 7,145 మంది రైతులకు అక్టోబర్‌ 2 నుంచి కొత్త హక్కు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో రెండు డ్రోన్లు, 51 రోవర్ల సహాయంతో రీ సర్వే జరుగుతోంది. 300 మంది విలేజ్‌ సర్వేయర్లను పది బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ ఓ సర్వేయర్, ముగ్గురు డెప్యూటీ సర్వేయర్లు పనిచేస్తున్నారు.  


పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ

వందేళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో భూముల రీ సర్వే జరుగుతోంది.  ఎవరు సాగు చేస్తున్నారు, హద్దులేంటి, ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న విషయాలను సమగ్రంగా పరిశీలించి రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నాం. పూర్తి పాదర్శకంగా, వివాదాలు పరిష్కారమయ్యేలా సర్వే జరుగుతోంది. ఒక్కో రెవెన్యూ గ్రామంలో భూ సర్వే పూర్తికావడానికి 3, 4 నెలలు పడుతోంది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్టోబర్‌ 2 నుంచి క్యూఆర్‌ కోడ్‌ కలిగిన భూహక్కు పత్రాలు, మ్యాప్‌లను రైతులకు అందజేయనున్నాం. ఆయా గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
– శ్యాం ప్రసాద్, జాయింట్‌ కలెక్టర్, పల్నాడు జిల్లా   

మరిన్ని వార్తలు