Pamidi Ramesh Babu Resign: టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా

19 Jul, 2022 08:18 IST|Sakshi

జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్‌ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్‌ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది.

 జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్‌చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్‌ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పమిడి రమేష్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. 

పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్‌ అనే వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్‌ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్‌చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది.  

ఇప్పటికే వైఎస్సార్‌ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు:  
దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది.  2020 నవంబరులో పమిడి రమేష్‌ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్‌చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్‌ హిట్‌ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దర్శి టీడీపీకి దిక్కెవరు..?  
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు