ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’

21 Jun, 2022 11:32 IST|Sakshi

మారేడుమిల్లి: దట్టమైన అడవులు....చుట్టూ ఎత్తైన కొండలు...పాతాళానికి జారిపోయేలా లోయలు, గలగలపాతే సెలయేళ్లు, పక్షుల కిలకిలారావాలు, వంపుసొంపుల రహదారులు, ఆహ్లాదం కలిగించే చల్లని వాతావారణం, మనస్సును మైమరిపించే ప్రకృతి రమణీయతకు నిలయం మారేడుమిల్లి మండలం. సుముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తున ఉండే ప్రాంతంలో వాలి సుగ్రీవ్‌ వాలమూలికల ప్రదేశం, జలతరంగిణి, అమృతధార జలపాతాలు, జంగిల్‌స్టార్, మన్యం యూ పాయింట్, వనవిహరి వంటి పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

ఇందులో పాములేరు గ్రామం ఒక్కటి. ఈ గ్రామం పక్కనుంచి సుందరంగా ప్రవహించే కొండవాగు పర్యాటకులను ఎంతగానో అకర్షిసుంది. అయితే ఈ వాగు చాలా ప్రమాదకరమైంది. ఇందులో స్నానాలకు దిగినవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. కొండల మధ్య సుంచి ఒంపుసొంపులుగా ప్రవహించే ఈ వాగు పైకి ఎంతో సుందరంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నీటి లోపల పెద్దపెద్ద సుడిగుండాలు, ముసళ్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే చాలా మంది పర్యాటకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. 

తరుచూ ప్రమాదాలు  
పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన కాళిదాస్‌ సందీప్, దాన ఆరుణ్‌కుమార్‌ అనే ఇద్దరు యువకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన బొక్కా మనోజ్, వాసు అనే ఇద్దరు యువకులు వాగులో మునిగి చనిపోయారు. గత ఏడాది రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్‌ విద్యార్థులు నలుగురు, రంగపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. అంతకు ముందు ఏడాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతై మృతి చెందారు. ఇలా గత పదేళ్లలో వందలాది మంది వాగులో మృత్యువాత పడ్డారు. 

ఫలితమివ్వని హెచ్చరిక బోర్డులు  
పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటవీశాఖ అధికారులు వాగులోకి దిగడాన్ని నిషేధించారు. వాగు వద్ద చుట్టూ గతంలో కంచెలు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిని పర్యాటకులు పట్టించుకోవడం లేదు. వాగులోకి దిగే సమయంలో స్థానిక గిరిజనులు హెచ్చరిస్తున్నా పర్యాటకులు లెక్క చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముందు, ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని స్ధానిక గిరిజనులు, పర్యాటకులు కోరుతున్నారు.  

(చదవండి: విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్ర నిర్మాణం)

మరిన్ని వార్తలు