కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు

1 Feb, 2021 05:09 IST|Sakshi

టీడీపీ మేనిఫెస్టో నిండా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలే 

గ్రామాల్లో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న పనులతో నింపేసిన చంద్రబాబు 

రూ.10,975 కోట్లతో ఇంటింటికీ కుళాయి పథకం ఇప్పటికే ప్రారంభం 

అదే హామీని అందులో పేర్కొన్న చంద్రబాబు  

మహిళలకు వడ్డీలేని రుణాలు కూడా అంతే..  

‘ఉపాధి’ పనిదినాల పెంపునూ కాపీకొట్టిన టీడీపీ అధినేత 

తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు 

సాక్షి, అమరావతి: ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసి తీవ్ర అపఖ్యాతి మూటగట్టుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ మేనిఫెస్టోలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇప్పటికే అమలుచేస్తున్న పనులను కాపీకొట్టి తన హామీలుగా ప్రకటించడాన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అలాగే, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా అమలుచేయకుండా పవిత్రమైన మేనిఫెస్టోకు విలువలేకుండా చేసి మళ్లీ అందులోవే కొన్ని తాజాగా ప్రకటించేసి మేనిఫెస్టో నింపేయడంపై ఆ పార్టీ నేతలే ఛలోక్తులు విసురుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్క కుటుంబానికి వంద గజాల్లో రూ.3లక్షలతో ఇల్లు నిర్మిస్తామని ఇప్పుడు  పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించడం ఏమిటని వారు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాక.. సీఎం జగన్‌ ఇప్పటికే అమలుచేస్తున్న పలు కార్యక్రమాలను చంద్రబాబు గురువారం ప్రకటించిన మేనిఫెస్టోలో పొందుపర్చడంపై కూడా తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఉదాహరణకు.. 

►సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు రూ.10,975 కోట్లతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఉచితంగా నీటి కుళాయిలు ఏర్పాటుచేసే ఓ కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించిన పనులు సాగుతున్నాయి. కానీ, చంద్రబాబు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా నీటి కొళాయిలు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ∙పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో.. ప్రతీ గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు. నిజానికి ఇదే హామీని ‘ఎన్టీఆర్‌ సుజల’ పేరుతో చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చాక ఈ హామీ అటకెక్కింది. రాష్ట్రంలో 48 వేలకు పైగా గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉండగా, ఐదేళ్లలో కేవలం 937 నివాసిత ప్రాంతాలలోనే మంచినీటి ప్లాంట్లను ఏర్పాటుచేసింది. 2019 నాటికి అవి మూలనపడ్డాయి.

►అలాగే, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రూపాయి కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీల సహకారంతో మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇప్పటికే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేస్తూనే, పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అమలుచేస్తోంది. అలాగే, గ్రామాల్లో చిరు వ్యాపారులకు జగన్‌ ప్రభుత్వం రూ.10 వేల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తోంది.

►కరోనా కష్టకాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పెద్దఎత్తున పనులు కల్పించి దేశంలోనే రికార్డు సాధించింది. కుటుంబానికి ఇచ్చే పనిదినాల సంఖ్యను 100–150కు పెంచేందుకు అనుమతి కోరుతూ సీఎం జగన్‌ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు అదే మాటను తెలుగుదేశం పార్టీ హామీగా పేర్కొన్నారు. 

ఇక.. మనం–మన పరిశుభ్రత పేరుతో సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు గ్రామాల్లో పారిశుధ్యం, చెత్త సేకరణ పనులు చేపడుతోంది. దీనిని కూడా చంద్రబాబు తన మేనిఫెస్టోలో పేర్కొని అభాసుపాలయ్యారు. 

.. ఇలా వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అమలుచేస్తున్న పలు కార్యక్రమాలను తమ అధినేత మేనిఫెస్టోలో ప్రకటించడం ఏమిటని టీడీపీ తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.   

మరిన్ని వార్తలు