'పంచాయతీ' పెట్టిన చిచ్చు..

27 Jan, 2021 20:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా మెలిగే రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతల మధ్య పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సమయంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తగదని ఏకతాటిపై నిలిచిన అన్ని ఉద్యోగ సంఘాలు, కోర్టు తీర్పు నేపథ్యంలో వేరు పడ్డాయి. కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా రావడంతో తాము కమీషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని ఓ వర్గం మాట మార్చి, ఇతర సంఘాలపై నిందలు మోపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సచివాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘం నాయకుడితో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి ఆమర్యాదపూర్వకంగా వ్యవహరించారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.  

అయితే దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి వివరణ ఇస్తూ.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు నా మీద చేసిన ఆరోపణలు బాధ కలిగించాయి, నేను ఏ రోజు కూడా సచివాలయానికి వచ్చిన ఏ ఉద్యోగ సంఘ నాయకుడితో కూడా ఆమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు,  సచివాలయ గోడలపై క్యాలెండర్లు అంటించవద్దు అని చెబితే దానిని అపార్థం చేసుకొని బొప్పరాజు తనను బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తనను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు.

ఇలాంటి ఆరోపణల వల్ల సంఘాలు బలపడటమో, బలహీనపడటమో జరగదు కానీ ఉద్యోగుల పరువు పోతుందని వెంకట రామిరెడ్డి వ్యాఖ్యానించారు. పోరాడి ఫలితం సాధించలేక పోయామని ఉద్యోగులు నిరాశలో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటే తమ పరువే పోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరం సంయమనంతో వ్యాహరిస్ధామని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వివాదాని​కి కారణం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ వర్గం మాట మార్చడమేనని సచివాలయ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు