కోనసీమలో పల్లెపోరు

20 Feb, 2021 02:46 IST|Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో కోనసీమకు ప్రత్యేక స్థానం

సాక్షి, అమలాపురం: రాజకీయంగా చైతన్యవంతమైన తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ (అమలాపురం డివిజన్‌)కు ఒక గుర్తింపు ఉంది. ఒకవైపు సముద్రం, మూడు వైపులా గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక స్థానముంది. పూర్తి వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతం కొబ్బరి సాగులో దేశంలోనే గుర్తింపు పొందింది. స్వతంత్ర ఉద్యమం నాటినుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం అధికం. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నాలుగో దశలో జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నికలు జరగనున్న ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 273 పంచాయతీలున్నాయి. వీటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 259 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు 711 మంది తలపడుతున్నారు.  

జాతీయస్థాయిలో రాణింపు 
కోనసీమకు చెందిన పలువురు నాయకులు జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులు పొందారు. దివంగత కళా వెంకట్రావు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో రెవెన్యూ, ఆంధ్రాలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత జీఎంసీ బాలయోగి దేశంలోనే అత్యుత్తమైన పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. మాజీమంత్రి పరమట వీరరాఘవులు పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. దివంగత మాజీమంత్రి మోకా విష్ణుప్రసాద్‌ తొలుత సర్పంచ్‌గా తరువాత అల్లవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా పనిచేశారు. సాధారణ గృహిణిగా ఉన్న చిల్లా జగదీశ్వరి సైతం తొలుత సర్పంచ్‌గా, తరువాత అల్లవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

పోరు ఏకపక్షమే 
కోనసీమలో పంచాయతీ పోరు ఏకపక్షమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల వ్యవస్థతో పల్లె కేంద్రంగా సాగుతున్న పాలనతో గ్రామాలు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు పెరగడంతో యువతలో ఉద్యోగ భరోసా ఏర్పడింది. రైతుభరోసా ద్వారా పెట్టుబడి సహాయం, కనీస మద్దతు ధరలు అందేలా తీసుకుంటున్న చర్యలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం వంటివి రైతులకు ఎంతో లబ్ధి కలిగిస్తున్నాయి.

గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, వరదలు, వర్షాల వల్ల మూడుసార్లు ఆయా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్న రైతులకు రెండు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ముఖ్యంగా కొబ్బరికాయ ధర రూ.6కు పడిపోయిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయించింది. అప్పటినుంచి కొబ్బరి ధర రూ.10కి తగ్గలేదు. ఈ చర్యలన్నీ రైతులకు ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచాయి. దీంతో కోనసీమ గ్రామాలు వైఎస్సార్‌సీపీ అభిమానులకే పట్టంకట్టే పరిస్థితి కనిపిస్తోంది. తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ఏకపక్షంగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారిలో గెలుపు నమ్మకం సడలిపోయింది. 

మరిన్ని వార్తలు