19 నెలల తర్వాత తెరచుకోనున్న ‘పాపికొండలు’

15 Apr, 2021 23:12 IST|Sakshi

పోలవరం: ఘోర ప్రమాదం జరిగిన 19 నెలల తర్వాత పాపికొండలు సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. ఆ ప్రమాదం అనంతరం పాపికొండల పర్యటన ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తిరిగి పాపికొండల సందర్శనకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆ ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో త్వరలోనే పాపికొండలు సందర్శించేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాపికొండలను వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి నుంచి పేరంటాలపల్లి వరకూ ఏపీ పర్యాటక శాఖ బోటులో ట్రయల్ రన్‌ నిర్వహించారు. పర్యాటక, పోలీస్, సాగునీటి, రెవెన్యూ అధికారులు ట్రయల్‌ రన్‌ను పర్యవేక్షించారు. కచ్చులూరు బోటు ప్రమాదంతో పాపికొండల విహారయాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు 19 నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ప్రయాణికుల భద్రతే పరమావధిగా విహార యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌పై నివేదికను ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని, త్వరలో టూరిజం మంత్రి అనుమతితో పాపికొండలు విహార యాత్ర ప్రారంభమవుతుంది అని ఏపీ టూరిజం జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పట్లో సందర్శకులను అనుమతించే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు