అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి మామయ్యా

8 Oct, 2020 17:12 IST|Sakshi

కరోనా కాలంలో జగనన్న విద్యా కానుకతో ఎంతో మేలు

జగనన్న గోరుముద్దతో పోషాకాహారం అందజేత

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు

అడ్డంకులను ఎదుర్కొని ఇంగ్లీష్‌ మీడియం బోధన

సాక్షి, పునాదిపాడు: ‘మనలాంటి పేదలకేం కావాలో, ఏమిస్తే ఏమిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మామయ్య మనకు దొరుకుతాడా.. అందుకే జగన్‌ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతునన్న షేక్‌ తస్లీం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు, వారి తలిదండ్రులు మాట్లాడారు. విద్యార్థిని షేక్ తస్లీం మాట్లాడుతూ.. ‘మన జగన్‌ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక, విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు. ఈ రోజు జగనన్న విద్యా కానుక. నాకొక కోరిక ఉంది. అది ఏంటంటే, నేను బాగా చదువుకుని కలెక్టర్‌ అయి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని. అప్పటి దాకా మీరు సీఎంగా ఉండాలి, ఉండి తీరాలి’ అని కోరింది.

‘కాన్వెంటు పిల్లలను చూసి వాళ్లలాగా బూటూ, సూటూ వేసుకుని వెల్లాలని ఉంటుంది. ఆ కోరిక నాకు ఈ ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్పారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన వస్తువులను కొనాలంటే 3500 రూపాయలు అవుతాయని చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధలేదు. అంతేకాదు నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టిహారం అందించారు. దాంతో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకేం కావాలో, ఏమిస్తే మనలాంటి పేదలు గొప్పవాళ్లమవుతామో ఆయనకు తెలుసు. ఈ వనరులను ఉపయోగించుకుని కలెక్టర్‌ అవుతాను’ అని చిన్నారి తస్లీం స్పష్టం చేసింది. (చదవండి: ‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే...)

జగన్‌ మామయ్య నాకిచ్చిన బహుమతి
అయిదో తరగతి విద్యార్థిని లీలా లహరి మాట్లాడుతూ..‘జగనన్న విద్యాకానుక, అది జగన్‌ మామయ్య నాకిచ్చిన బహుమతి. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది, నేను మాటిస్తున్నాను, బాగా చదవి తరగతిలో ఫస్ట్ ర్యాంకు సాధిస్తాను. నా ఫ్రెండ్స్‌ను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరమని ఎంకరేజ్‌ చేస్తాను. నా తల్లిదండ్రులు ఆర్ధిక పరిస్ధితి సరిగా లేకపోవడం వల్ల నేను గతేడాది మండల పరిషత్‌ స్కూల్లో నాలుగో తరగతిలో చేరాను. గతేడాది మా అమ్మ జగనన్న అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంది. నిజంగా ఈ డబ్బులు మా తల్లిదండ్రులకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇది నా విద్యా జీవితంలో చాలా మంచి మార్పు. ఈ సంవత్సరం మరో మంచి మార్పు నా విద్యా జీవితంలో రాబోతుంది. అదే జగనన్న విద్యాకానుక. మాకు కావాల్సిన వాటిని ఈ విద్యా సంవత్సరంలో మా తరగతులు ప్రారంభం కాకముందే ఇవ్వడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నది. (చదవండి: అమ్మఒడితో కొండంత భరోసా)

విద్యార్థులు, తలిదండ్రులు మీ వెనుకే..
పాఠశాల పేరెంట్స్ కమిటీ మెంబర్‌ ఉషా కుమారి మాట్లాడుతూ.. ‘ఈ రోజు జగనన్న విద్యాకానుక కింది ఇచ్చిన వస్తువులన్ని పేద, మద్యతరగతి, నిరుపేద తల్లిదండ్రులకు ఈ కరోనా టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదే కాకుండా అమ్మఒడి పథకం కింద 15వేల రూపాయలు ఆర్ధికంగా వాళ్లు ఎదిగేందుకు మాకు అందజేశారు. మరి నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్లు రిపేర్లు, ఆడపిల్లలకు ప్రత్యేక బాత్రూంలు, స్కూళ్లో వాటర్‌ ట్యాంకులు, బోర్డులు, ఫ్యానులు అన్నీ సమకూర్చారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఈ గవర్నమెంటు స్కూళ్లను నిలబెట్టిన మా జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం  ఎందుకుని ఎన్నో అవరోధాలు సృష్టించినప్పటికీ., మా పేద, మద్యతరగతి పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందజేసినందుకు మీకు చాలా, చాలా ధన్యవాదములు. ఇంగ్లిషు మీడియం కోసం పేద, మద్యతరగతి వాళ్లు ప్రైవేటు స్కూళ్లకు పంపలేరు. దీన్ని ఇలాగే కొనసాగించండి. మీ వెనుక మేం తల్లిదండ్రులందరం ఉన్నామని  స్వయంగా చెపుతున్నాం’ అన్నారు. (చదవండి: చక్కని వసతులు.. ఇంగ్లిష్‌ మాటలు)

మీరిలాగే ముందుకు వెళ్లాలి. 
‘నేటి బాలలే రేపటి పౌరులగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూలిపనులకెలుతుంటే  పిల్లలు  ఏం తింటారనే బెంగలేకుండా.. మధ్యాహ్న భోజన పథకంలో ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో మా పిల్లలకు వెజిటబుల్‌ బిర్యానీ, చిక్కీ, పొంగల్, గుడ్డు పెడుతూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇకపై పిల్లలకు అక్షరాభాస్యం చేసేటప్పుడు ఏ దేవుడు పేరో రాయకుండా జగన్‌ మామయ్య అని రాసే రోజులు ఎంతో కాలం లేవని ఘంటాపధంగా తెలియజేస్తున్నాం. రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవరకు మీరు మా ముందుండి నడిపించి ఇలానే ముందుకు వెళ్లాలి’ అని కోరుకుంటున్నాము అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా