వైద్యం లేని రోగం

27 Aug, 2020 10:55 IST|Sakshi
మంచానికే పరిమితమైన కుమారుడికి అన్నం పెడుతున్న లక్ష్మమ్మ, పెంచలయ్య

సరస్వతీ పుత్రుడు.. సంకట పరిస్థితి

మంచానికే ఇంజినీరింగ్‌ విద్యార్థి   

దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు 

ఆత్మకూరు: అతను సరస్వతీ పుత్రుడు. అనారోగ్య పరిస్థితుల్లో వైద్యం పొందుతూనే అత్యధిక మార్కులు సాధించాడు. వైద్యం లేని రోగంతో చివరకు మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడు మంచి చదువులు చదువుకుని తమకు ఆసరాగా ఉంటారనుకున్న కూలీనాలీ చేసుకునే ఆ తల్లిదండ్రులపై విధి పగబట్టింది. 
ఆత్మకూరులోని సోమశిల రోడ్డు ప్రాంతానికి చెందిన కనుమూరి పెంచలయ్య, లక్ష్మమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  
వీరి కుమారుడు ప్రేమ్‌కుమార్‌ చదువుల్లో రాణిస్తూ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనే పట్టుదలతో చదువుతూ ఉత్తమ మార్కులు సాధిస్తున్నాడు.  
పదో తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించడంతో అప్పటి కలెక్టర్‌ రవిచంద్ర ఈ విద్యార్థి పరిస్థితి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించి ఉన్నత చదువుల కోసం స్కాలర్‌ షిప్‌ మంజూరు చేయించారు.  
ఇంటర్మీడియట్‌లోనూ మంచి మార్కులు సాధించిన ప్రేమ్‌కుమార్‌  ఆంధ్రా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాడు.  
తొలి ఏడాదిలోనే అతనికి ఓ రోజు తీవ్రజ్వరం రావడంతో చికిత్స చేస్తున్న క్రమంలో ఇతనికి షుగరు వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాసులయ్యారు. 
షుగరు  సాధారణ స్థితిలో కాకుండా తీవ్రతగా ఉండడంతో స్థానిక డాక్టర్ల సలహా మేరకు నెల్లూరు, చెన్నైల్లో వైద్యం చేయించారు. 
ఓ రోజు కాళ్లు సైతం చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు.  
కళాశాల ప్రొఫెసర్లు ప్రేమ్‌కుమార్‌ పరిస్థితి చూసి చదువు నిలిపి వేయాలని సూచించారు. 
అయినా పట్టుదలతో వైద్యం చేయించుకుంటూనే కళాశాలకు రాలేకున్నా.. ఇంటి వద్దనే చదివి పరీక్షలు రాస్తానని కోరాడు.  
అతని పరిస్థితిని పరిశీలించిన కళాశాల యాజమాన్యం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.  
ఇంటి వద్ద నుండే చదువుకుని ఇంజినీరింగ్‌ పరీక్షలు రాసిన ప్రేమ్‌కుమార్‌ 80 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.  
అయితే రోజురోజుకూ వైద్యం లేని రోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.  
ఇప్పటికే వైద్యం కోసం నెల్లూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రూ. 10 లక్షలకు పైగా అప్పులు చేసి ఖర్చు చేశారు.  
ప్రతి నెల వైద్యం కోసం రూ.10 వేలకు పైగా ఖర్చువుతోందని వారు తెలిపారు.  
చదువుల్లో ఉత్తమ మార్కులతో రాణించి తాను ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులు కష్టాలు తీర్చాల్సింది  పోయి, మంచానికే పరిమితమై వారితో సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితుడు ప్రేమ్‌కుమార్‌ కన్నీటిపర్యంతమవుతున్నాడు. 
ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తప్ప తన పరిస్థితి మెరుగు పడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి సహాయ పడాల్సిన అవసరం  ఉంది.  

మరిన్ని వార్తలు