దళిత మహిళలకు బాబు క్షమాపణ చెప్పాలి

25 Oct, 2020 04:07 IST|Sakshi
నిరాహార దీక్షలో మాట్లాడుతున్న పరిశపోగు శ్రీనివాసరావు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు

తాడికొండ: నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నందుకు నిరసన తెలిపేందుకు వస్తున్న దళిత మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు అన్నారు. బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న దళిత మహిళలను తన పార్టీ గూండాలతో  ట్రాక్టర్లతో తొక్కించి చంపుతామని బెదిరింపులకు పాల్పడడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.

ఈ తప్పుడు చర్యలకు విగ్గు రాజు వంతపాడుతూ అబలలను నోటికి పట్టని మాటలనడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశమని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే రఘురామకృష్ణంరాజుకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. రాజధానిలో ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. విజయవాడ బార్‌ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు తెలిపారు.  పలువురు మాట్లాడుతూ..దళిత, ముస్లిం మైనార్టీలకు చెందిన లంక, అసైన్డ్‌ భూములను బెదిరింపులతో కారుచౌకగా కొనుగోలు చేసి పూలింగ్‌కు ఇచ్చి భారీగా లబ్ధి పొందారన్నారు. కాగా, పలువురు మహిళలు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి, చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని దహనం చేశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు