విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..

26 Aug, 2022 10:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్‌ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్‌ నిషేధించడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్‌ వరకు 22 వేలమందికిపైగా బీచ్‌క్లీనింగ్‌ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్‌ క్లీన్‌చేసి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 

20 వేలమందికి ఉపాధి కల్పన
పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ సీఈవో సెరిల్‌ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్‌ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్‌ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి సన్‌గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌కుమార్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్‌ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. 

మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్‌
విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్‌ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్‌క్లీనింగ్‌ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, సీపీ సీహెచ్‌ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు