బొర్రా అందాలు అమోఘం 

25 Apr, 2022 04:55 IST|Sakshi
బొర్రా అందాలను తిలకిస్తున్న పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్, మెంబర్లు

పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ సంతోష్‌కుమార్‌ గన్వర్‌  

అనంతగిరి/అరకులోయ రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్‌ స్టడీ ఆన్‌ పబ్లిక్‌ సెక్టార్‌పై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ సంతోష్‌కుమార్‌ గన్వర్‌ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్‌ మాతుర్, పార్లమెంట్‌ సెషన్స్‌ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు.

పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్‌ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్‌ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్‌ఐలు రాము, నజీర్‌ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్‌ హరి, అనంతగిరి పీహెచ్‌సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు