దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్‌’.. సీమలో దొంగతనాలతో హల్‌చల్‌

29 Apr, 2022 11:55 IST|Sakshi

పార్థీ గ్యాంగ్‌... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్‌ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్‌.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్‌. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు  ఈ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం  ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్‌ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 

మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు.  



ఈ నెల 20న పార్థీ గ్యాంగ్‌ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు 

అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్‌ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు.  ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్‌కు ఓ మహిళ డాన్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది.  

ఈ పార్థీ గ్యాంగ్‌ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్‌ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్‌ ఆఫ్‌ చేస్తారు. ఈ గ్యాంగ్‌లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్‌ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు.   

వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ 
ఫింగర్‌ ప్రింట్స్‌ అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్‌లో తీసుకుని, ఇంటిగ్రేట్‌ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్‌లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్‌ చేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్‌ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు.       
– ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్‌     

మరిన్ని వార్తలు