APSRTC: చౌకగా ఆర్టీసీ కార్గో సేవలు.. పెరుగుతున్న ఆదరణ

9 Jul, 2022 18:47 IST|Sakshi

సమయానికి గమ్యస్థానాలకు..

కార్గోసేవలపై పెరిగిన నమ్మకం

ఆర్టీసీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి

ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ప్రయాణం సురక్షితంగా.. సుఖవంతంగా సాగుతుందన్న భరోసా. ఇప్పుడు కార్గో సేవల్లోనూ ఆ సంస్థ అధికారులు అదే మంత్రాన్ని పఠిస్తున్నారు. సరుకులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. చౌకగా రవాణా సేవలు అందిస్తున్నారు. అందుకే... ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సుస్థిర ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. దీనికి పార్వతీపురం మన్యం జిల్లాలో కార్గో సేవలతో ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయమే నిదర్శనం.  


పార్వతీపురం టౌన్‌:
ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. సరకు రవాణా పెరుగుతుండడంతో సంస్థకు అదనపు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో కార్గో ఆదాయం గతేడాది కంటే పెరిగింది. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో సురక్షితంగా సేవలందుతుండడంతో వినియోగదారులు కార్గోపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. 


చౌకగా రవాణా..  

వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తదితరవి తక్కువ చార్జీలతో రవాణా చేస్తుండడంతో ఆర్టీసీ కార్గోసేవలు వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. జిల్లాలో కార్గో సేవల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.90లక్షల ఆదాయం సమకూరింది. పార్సిల్స్, కొరియర్‌ కవర్లు రవాణా చేయడంతో ఈ ఆదాయాన్ని సముపార్జించింది. రోజూ సుమారు మూడు డిపోల ద్వారా 90 పార్సిళ్లు ఉంటున్నాయి. పార్సిళ్లను జిల్లాలో అయితే సుమారు 8 గంటల్లోపు, రాష్ట్రంలో అయితే 24 గంటల్లోపు గమ్య స్థానాలకు చేర్చుతోంది. 2021–22లో సరుకు రవాణాతో రూ.1.16 కోట్ల ఆదాయం ఆర్జించింది.   


యువతకు ఉపాధి.. 

కార్గో సేవలతో ఓ వైపు ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. జిల్లాలో ని 3 డిపోల నుంచి సరకు రవాణా చేయడమే కాకుండా పార్వతీపురం డిపోకు అనుసంధానంగా బొబ్బిలి బస్టాండ్‌లో కార్గో పాయింట్లలో ఆరుగురు, సాలూరు డిపోలో ఆరుగురు, పాలకొండలో ఆరుగురు మొత్తం 18 మంది ఏజెంట్లను నియమించింది. వారికి కార్గో వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది. 180 మంది కళాసీలకు పని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన మరింతమంది నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఏజెన్సీలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా కేవలం సరకు బుకింగ్, డెలివరీ సదుపాయాలే కాకుండా ఆర్టీసీ బస్‌ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రూ.10వేలు డిపాజిట్‌గా, మిగిలిన ప్రాంతాల్లో రూ.1000 డిపాజిట్‌ చెల్లించి ఏజెన్సీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. 


నమ్మకంతో రవాణా
 
ఆర్టీసీ కార్గో పార్సిల్‌ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగింది. అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఆదాయం గణనీయంగా వృద్ధిచెందింది.  వ్యాపారులకు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు వారి సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం.  
– టీవీఎస్‌ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం

మరిన్ని వార్తలు