అడవి బిడ్డలకు ఆర్థిక భరోసా

11 Apr, 2022 18:00 IST|Sakshi

జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు

జీసీఎంఎస్‌ పరిధిలో తయారు, విక్రయం 

పార్వతీపురం టౌన్‌: ఆరు దశాబ్దాల కిందటి వరకూ గిరిజనులు నిలువు దోపిడీకి గురయ్యేవారు. గిరిజనులు పండించే పంటను మైదాన ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేసి వారి శ్రమను దోచుకునేవారు. గిరిజన గూడాల్లో జీసీసీలు ఏర్పడే వరకూ ఇదే తంతు సాగగంతో ఆర్థికంగా వారి బతుకులు కుదేలయ్యాయి. అయితే ఇప్పుడు గిరిజనుల సంపదకు వారే యజమానులు. గిరిజనుల నుంచి మద్దతు ధరకు ముడిసరుకును జీసీసీ (గిరిజన సహకార సంస్థ) కొనుగోలు చేస్తుండడంతో వారి మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

ఇలా కొనుగోలు చేసిన సరుకులను మరింత నాణ్యమైన ఉత్పత్తులుగా మలిచి జీసీఎంఎస్‌ (గిరిజన్‌ కార్పొరేషన్‌ మార్కెటింగ్‌ సొసైటీ) ద్వారా   జనం చెంతకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) చేర్చుతోంది. తక్కువ ధరలకే విక్రయిస్తూ అటు వినియోగ దారులు, ఇటు గిరిజనులకు లాభాల వారధిగా నిలుస్తోంది. దళారుల బారినుంచి గిరిజనులను కాపాడుతూ అధిక ఆదాయం అర్జించి పెడుతూ ఏటా రూ.కోట్ల విలువైన వ్యాపారం సాగిస్తోంది. 

ఉత్పత్తులు ఇలా..  
గిరిజనుల నుంచి తేనె, చింతపండు, నరమామిడి వంటి దాదాపు 26 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను ఏటా జీసీసీ కొనుగోలు చేసి   70 కేంద్రాల్లో నిల్వచేస్తోంది. ఏడు పారిశ్రామిక సదుపాయాల్లో ప్రాసెసింగ్‌ అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవడమే జీసీసీ లక్ష్యం. పసుపు, కుంకుమ, తేనె, షరబత్, షాంపూలు, సబ్బులు, కాఫీ పొడి తదితర 27 ఉత్పత్తులను రిటైల్‌గా ప్రత్యేక ఔట్‌లెట్లు, సూపర్‌ బజార్లు, రైతుబజార్లు, ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిసర గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్‌ పెట్టి విక్రయాలు నిర్వహించడమే కాకుండా మొబైల్‌ సేవలను కూడా ప్రారంభించింది. మారుమూల పల్లెలకు గిరిజన ఉత్పత్తులను చేరవేస్తోంది. 

గిరిజనులకు ఆర్థిక ఊతం 
ప్రకృతి సిద్ధమైన గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవకుండా మైదాన ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు జీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలందరికీ చేరువచేసే ప్రణాళిక సిద్ధం చేశాం. గిరిజనులకు ఆర్థిక ఊతం కల్పిస్తాం. ముడిసరుకులకు మద్దతు ధరకల్పిస్తాం. 
 - శోభా స్వాతిరాణి, చైర్‌పర్సన్, జీసీసీ  

ప్రతి గ్రామానికి చేరువ చేస్తాం 
జీసీఎంఎస్‌కు మరింత ఆదాయం చేకూరేలా ఉత్పత్తులను గ్రామ స్థాయి ప్రజలకు అందించేందు మొబైల్‌ సేవలు ప్రారంభించాం. దీనివల్ల గిరిజనులు లబ్ధిపొందడమే కాకుండా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి జీసీఎంఎస్‌ ఉత్పత్తులు సరఫరా అయ్యేలా మొబైల్‌ సేవలను విస్తృతం చేస్తాం. 
- డి. సురేంద్ర కుమార్, జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ పార్వతీపురం  

ఆరోగ్యకర ఉత్పత్తులు 
స్వచ్ఛమైన ముడి సరుకుల తో ప్రజారోగ్యానికి ఎటు వంటి హాని   కలిగించని ఉత్పత్తులను జీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నాం. ఆరోగ్యానికి మేలుచేసే ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నాం. జిల్లా కేంద్రం పార్వతీపురం పరిధిలో నాలుగు స్టాల్స్‌తో పాటు మొబైల్‌ వాహన సేవలు ప్రారంభించాం. 
- సాంబశివరావు, సీనియర్‌ అసిస్టెంట్, జీసీసీ పార్వతీపురం 

మరిన్ని వార్తలు