విద్యుత్‌ వినియోగం తెలుసుకో.. బిల్లు భారం తగ్గించుకో..

8 Sep, 2022 19:10 IST|Sakshi
వీరఘట్టం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

విద్యుత్‌ వృథాకు కళ్లెం వేయాలంటున్న అధికారులు

నేటి విద్యుత్‌ పొదుపు భవిష్యత్‌కు మదుపు

మన్యం జిల్లాలో ప్రతీరోజు 3.5 లక్షల యూనిట్ల వినియోగం  

ఇంటిలో కావలిసినంత వెలుతురు ఉంటుంది... కానీ విద్యుత్‌ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. సహజసిద్ధమైన గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నా ఏసీలు ఆపేందుకు ఇష్టపడం.. కళ్ల ముందే ఫ్యాన్‌లు తిరుగుతున్నా పట్టించుకోం. జీరో ఓల్ట్‌ బల్బులతో విద్యుత్‌ పొదుపు చేయవచ్చని ఆ శాఖాధికారులు పదేపదే చెబుతున్నా వినిపించుకోం.. ప్రతినెలా వచ్చే బిల్లును చూసి భయపడతాం. అందుకే.. వినియోగం తెలుసుకుని.. బిల్లు భారం తగ్గించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారుల్లో చైతన్యం నింపుతున్నారు.  

వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా.. కాస్త పొదుపు మంత్రం పాటిస్తే.. ఇతర పారిశ్రామిక అవసరాలను తీర్చవచ్చని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వినియోగదారులపై బిల్లుల భారం కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. విద్యుత్‌ను ఆదాచేసే చిన్నచిన్న మెలకువలను తెలియజేస్తున్నారు. విద్యుత్‌ ఆదాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు.  

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్ల వివరాలిలా..  
పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 1,65,784 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగం కనెక్షన్లు 1.05 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 22 వేలు, వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లు 3033, ఇతర విద్యుత్‌ కనెక్షన్లు 35,751 ఉన్నాయి. రోజుకు జిల్లాలో 3.5 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్‌ పొదుపు పాటిస్తే భవిష్యత్‌లో మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. (క్లిక్: చదువు+ ఉద్యోగం= జేఎన్‌టీయూ)

ఇదీ లెక్క.. 
ఒక్కో విద్యుత్‌ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణ బల్బు వంద వాట్స్‌ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. ఒక కిలోవాట్‌. గంట పాటు పది బల్బులు(ఒక కిలోవాట్‌) ఒకేసారే వేస్తే ఒక యూనిట్‌ విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. ఇలా ప్రతీ విద్యుత్‌ ఉపకరణానికీ ఓ లెక్క ఉంది. దీనిని తెలుసుకుంటే అవసరం మేరకు విద్యుత్‌ను వినియోగించవచ్చని, బిల్లు కూడా ఆదా అవుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం  
జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. ఇందులో చాలా వరకు విద్యుత్‌ అనవసరంగా వాడుతున్నారు. అవసరం లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు, ఇన్వర్టెర్లు వినియోగి స్తున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ వల్ల కూడా విద్యుత్‌ వినియోగం పెరిగింది. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ప్రజలు విద్యుత్‌ ఆదా చేయాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నాం.
– టి.గోపాలకృష్ణ, విద్యుత్‌శాఖ ఈఈ, పాలకొండ

మరిన్ని వార్తలు