ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపు.. జాగ్రత్త సుమా!

15 Jul, 2022 16:44 IST|Sakshi
నాటు బళ్ల రైతులతో మాట్లాడుతున్న ఎస్సై కె.నీలకంఠం

రాత్రిపూట రోడ్లపై అప్రమత్తంగా ఉండాలి

రేడియం స్టిక్కర్లు వాడాలి: సీతానగరం ఎస్సై

సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు(నాటుబళ్లు)తో ప్రయాణం చేస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కె.నీలకంఠం హితవు పలికారు. ఈ మేరకు నాటుబళ్లతో రాత్రి పూట ప్రయాణం చేస్తున్న రైతులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుబళ్లతో ఇసుక తరలించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడం వల్ల బూర్జ, పెదంకలాం, లక్ష్మీపురం, చినభోగిలి, పెదభోగిలి, సీతానగరం, తామరఖండి అంటిపేట, వెంకటాపురం, నిడగల్లు, కాశీపేట, పణుకుపేట తదితర గ్రామాల్లో నాటుబళ్లు ఉన్న రైతులు సువర్ణముఖినదిలో రేవులనుంచి రాత్రిపూట ఇసుక తరలించి విక్రయాలు చేస్తున్నారన్నారు. 

రాత్రిపూట నాటుబళ్ల ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటుబళ్లు ఉన్న రైతులు బళ్లకు ‘రేడియం’ స్టిక్కర్లు విధిగా వాడాలని సూచించారు. రేడియం స్టిక్కర్లు అతికించడం వల్ల రాత్రిపూట ఎదురుగా రాక పోకలు చేస్తున్న భారీ వాహనాలకు నాటుబండి వస్తున్నట్లు  తెలుస్తుంద న్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన  హెచ్చరిక బోర్డులున్న చోట భారీవాహనాల డ్రైవర్లు, నాటుబళ్లతో వెళ్తున్న రైతులు జాగ్రత్తలు  పాటించాలని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు