నాడు దానం చేసి.. నేడు క్షణమొక యుగంలా

5 Aug, 2020 08:53 IST|Sakshi

నాడు తండ్రి అవయవాలు దానం 

నేడు సాయం కోసం ఎదురుచూపు  

సోదరి కష్టం చూసి తల్లడిల్లుతున్న చెల్లి

సాక్షి, కంకిపాడు (పెనమలూరు):  ఉన్న రెండు కిడ్నీలు పాడై క్షణం ఒక యుగంలా కాలం వెళ్లదీస్తోంది ఓ సోదరి. తన తోబుట్టువుకు చిన్న వయస్సులోనే వచ్చిన కష్టం చూసి తల్లడిల్లిపోతూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆమె సోదరి. చిన్నతనంలోనే తల్లిని, ఊహ తెలిశాక తండ్రిని కోల్పోయారు వారిరువురూ. తండ్రి మరణంతో అవయవాలను దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాడు ఔదార్యం చాటిన చిట్టి మనస్సులు నేడు సాయం కోసం చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నాయి. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కొప్పనాతి పార్వతి, లక్ష్మీ తిరుపతమ్మ సోదరీమణులు ఎదుర్కొంటున్న కష్టం వారి మాటల్లోనే.... కొప్పనాతి నాగరాజు, వీరకుమారి మా అమ్మానాన్న. మాకు ఉహ కూడా తెలీదు. చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నాన్న కూలీ చేసి మమ్మల్ని పోషించాడు. 2013 లో కృష్ణా కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న ఊక లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మా నాన్న నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్చారు.

పది మందిలో బతికుంటాడని!  
గాయాలు తీవ్రంగా అవ్వటంతో డాక్టర్లు బ్రెయిన్‌ డెడ్‌కేసుగా తేల్చారు. లాభం లేదని చెప్పారు. ఆ సమయంలో వైద్యు లు అవయవ దానం గురించి చెప్పారు. అవయవాలను దానం చేయటం ద్వారా మా నాన్న పది మందిలో బతికి ఉంటారని భావించాం. ఎలాంటి లాభం ఆశించకుండా కళ్లు, గుండె, కిడ్నీలు, పనికి వచ్చే ప్రతి అవయవాన్ని తీసుకున్నారు. మనస్సులో బాధ ఉన్నా సంతోషంగా అవయవాలు దానమివ్వటం జరిగింది. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం)
  
రెండేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ!

నాన్న చనిపోయాక మద్దూరులో అమ్మమ్మ దగ్గర పెరిగాం. హాస్టల్‌లో ఉండి పదోతరగతి వరకూ చదువుకున్నాం. రెండేళ్ల కిందట అక్క పార్వతికి వివాహం జరిగింది. ఆమె కు అయిన ఆర్నెల్లకు నాకు వివాహం జరిగింది. అయితే కిడ్నీ సమస్య ఏర్పడటంతో అక్కకు ఆమె భర్త దూరంగా ఉంటున్నారు. అమ్మమ్మ దగ్గరే ఉంచి అక్కను ఆసుపత్రుల చుట్టూ తిప్పాం. కిడ్నీలు రెండూ పాడయ్యాయని, జీవన్‌ పథకం కింద కిడ్నీ మారి్పడికి రూ.30 లక్షలు వరకూ ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కిందకు వైద్యం రాదని వైద్యులు చెప్పారు. రూ 30 లక్షలు అంటే మా శక్తికి మించింది. ఎలాంటి ఆధారం లేదు. పింఛనుగా వచ్చే రూ.10 వేలుతో అవసరమైన ఖర్చులు పెట్టి డయాలసిస్‌ చేయించుకుంటూ అక్క పార్వతి ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నా. అక్క ప్రాణాలు కాపాడుకోవాలి’ అంటోంది చెల్లెలు లక్ష్మీ తిరుపతమ్మ. 

సాయం అందించండి 
నా ఆరోగ్యం పాడై చాలా ఇబ్బంది పడుతున్నా. డయాలసిస్‌కు, ఇతర ఖర్చులకు పింఛనుతో పాటుగా చెల్లి ఎంతో ఆదుకుంటోంది. కానీ వైద్యం చేయించుకోవాలంటే రూ.30 లక్షలు కావాలంటున్నారు. మాకు వెన్నుదన్నుగా ఎవరూ లేరు. నా కాళ్ల మీద మళ్లీ నేను బతకాలనుంది. అలా జరగాలంటే కిడ్నీ మార్పిడి జరగాలి. సాయం అందించాలని వేడుకుంటున్నా.  –కొప్పనాతి పార్వతి   

మరిన్ని వార్తలు