ఎగిరిపోదాం ఎంచక్కా..

1 Jul, 2021 21:00 IST|Sakshi

‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టు నుంచి పుంజుకున్న రాకపోకలు

విశాఖకు అధికం.. తర్వాత బెంగళూరుకు

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): విమానయానంపై కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణ సమయం ఆదా అవుతుందనే ఉద్దేశం, నూతన ప్రయాణ అనుభూతి పొందాలన్న ఉత్సుకతతో విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో కర్నూలు ఎయిర్‌పోర్టు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం – ఓర్వకల్లు) నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి.

నగరాలకు చలో చలో
కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాది మార్చి 28న విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఉడాన్‌ పథకం కింద ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఆయా నగరాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వ్యాపారులు అధికశాతం విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వీకెండ్‌లో రెండు రోజుల సెలవు ఉంటుండడంతో విమానంలో సొంతూళ్లకు వచ్చి వెళుతున్నారు. విశాఖపట్నం అందాలను తిలకించడానికి జిల్లా నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.

గోవాకు వెళ్లే వారు వయా బెంగళూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. విశాఖ – కర్నూలు మధ్య నడిచే సర్వీసుల్లో 72 సీట్లకు గాను ప్రతిసారి 55–60 మంది ప్రయాణిస్తున్నారు. బెంగళూరుకు కూడా 50 మందికి తగ్గకుండా వెళ్తున్నారు. చెన్నైకి వెళ్లే వారి సంఖ్య మాత్రం కాస్త తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఆ నగరానికి రాకపోకలు సాగిస్తున్న వారిలో వ్యాపారులు  ఎక్కువగా ఉంటున్నారు. కర్నూలు– చెన్నై సర్వీసుల్లో 72 సీట్లకు గాను 40–45 సీట్లు భర్తీ అవుతున్నాయి.

క్రమంగా పెరుగుదల
కరోనా రెండో దశ ప్రభావం విమాన ప్రయాణాలపైనా బాగానే పడింది. బెంగళూరు, చెన్నై నగరాల్లో లాక్‌డౌన్‌ విధించడం, ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పెట్టడంతో ఆ సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విమాన రాకపోకలపై నిషేధం లేకున్నా లాక్‌డౌన్, కర్ఫ్యూ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. మే మాసంలో ఒక్కో ట్రిప్పులో 10–15 మంది కూడా ప్రయాణించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా కేసులు తగ్గిపోవడం, లాక్‌డౌన్‌ ఎత్తేయడం, కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో విమాన ప్రయాణాలు మళ్లీ పుంజుకున్నాయి. విద్యా సంస్థలు పునః ప్రారంభమై, వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో ఊపందుకుంటే ఇక్కడి నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.

ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది
కరోనా సెకండ్‌ వేవ్‌తో మే మాసంలో విమాన ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్లేవారు..వచ్చే వారు అధికంగా ఉంటున్నారు. కైలాస్‌ మండల్, ఏడీ, ఎయిర్‌పోర్టు అథారిటీ

విమానాల టైం టేబుల్‌ 
ఫ్లైట్‌ నంబర్‌    సర్వీసు అందుబాటులో        బయలుదేరు    సమయం     చేరుకునే        సమయం
                             ఉండే రోజులు                  ఎయిర్‌పోర్టు                        ఎయిర్‌పోర్టు    

6ఈ7911      సోమ, బుధ, శుక్ర, ఆది               బెంగళూరు         09.05         కర్నూలు           10.10    
6ఈ7912     సోమ, బుధ, శుక్ర, ఆది                 కర్నూలు           10.30       విశాఖపట్నం       12.40    
6ఈ7913     సోమ, బుధ, శుక్ర, ఆది               విశాఖపట్నం      13.00         కర్నూలు            14.55
6ఈ7914     సోమ, బుధ, శుక్ర, ఆది                 కర్నూలు          15.15        బెంగళూరు          16.25    
6ఈ7915     మంగళ, గురు, శని, ఆది              చెన్నై                14.50         కర్నూలు            16.10    
6ఈ7916     మంగళ, గురు,శని, ఆది               కర్నూలు           16.30            చెన్నై              17.50

విమాన టికెట్‌ ధరలు (రూ.లలో)
కర్నూలు – బెంగళూరు    2,077    
కర్నూలు – చెన్నై            2,555    
కర్నూలు– విశాఖపట్నం  3.077

మరిన్ని వార్తలు