చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లు

22 Apr, 2022 18:20 IST|Sakshi

కాకినాడ: ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది.

కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్‌ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు