అక్రమాల పుట్ట ‘అమరావతి’

18 Mar, 2021 03:13 IST|Sakshi

రాజధాని ముసుగులో గత సర్కారు అవకతవకలు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి అసైన్ద్‌ స్కామ్‌ వరకు అంతా బాబు డైరెక్షన్లోనే

భూముల కొనుగోలు, ల్యాండ్‌ పూలింగ్, కేటాయింపుల్లో లొసుగులెన్నో

జాబితాతో సహా గుట్టురట్టు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక

తాజాగా సీఐడీ విచారణలో అసైన్డ్‌ భూ భాగోతం బట్టబయలు

సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్‌ పూలింగ్‌), ప్రైవేట్‌ సంస్థలకు కేటాయింపు, సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు.

అమరావతిలో జరిగిన అసైన్డ్‌ భూముల స్కామ్‌ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ సన్నిహితుడు వేమూరు రవికుమార్‌ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్‌ యాదవ్‌ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే.

ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ
మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్‌ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్‌ సిటీ, క్యాపిటల్‌ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. 

అక్రమాల చిట్టా...
చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ బినామీ వేమూరి రవికుమార్‌ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్‌ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్‌ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్‌ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్‌ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది.

బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా..
టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్‌ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 

ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు
అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్‌ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్‌ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అసైన్డ్‌ భూ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు నేపథ్యంలో ఈ నెల 23న చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తప్పించుకునేందుకు దారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు