పాడిరైతుకు అభయం

11 Jun, 2022 23:46 IST|Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ పశు నష్టపరిహార పథకం  

గేదెలు, గొర్రెల రైతులను అదుకుంటున్న ప్రభుత్వం 

ప్రమాదవశాత్తు, అకస్మాత్తుగా పశువులు, గొర్రెలు చనిపోతే పరిహారం  

జిల్లాలో ఆవులు, గేదెలు:4,43,206  

గొర్రెలు,మేకలు : 13,40,369 

కోళ్లు :11,00,510  

కడప అగ్రిక్చర్‌: రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తోంది.పాడి పశువులు, ఆవులు, గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తుగానీ, అకస్మాత్తుగా గానీ మృతి చెందింతే రైతులు అర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు డాక్టర్‌ వైస్సార్‌ పశు నష్టపరిహార పథకం కింద పరిహారం అందిస్తూ రైతన్నలను ఆదుకుంటోంది.

ఇటీవలే వైఎస్సార్‌ పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ పశువైద్యానికి  పెద్దపీట వేసింది. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే 1962కు ఫోన్‌ కొడితే చాలు ఇంటి ముంగిటకే పశువైద్య సేవలందుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

పాడి పశువులైతేనే నష్టపరిహారం 
రైతులకు సంబంధించి పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు మేకలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే డాక్టర్‌ వైస్సార్‌ పశు నష్టపరిహారం పథకం కింద నగదు అందించి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోంది. పశువుగానీ, ఆవులు కానీ ఒక ఈత ఈనినవై ఉండాలి. ఇందులో నాటు పశువు(నాటు రకం గేదె) మృతి చెందితే రూ. 15 వేలు, చుక్క, ముర్రా జాతికి చెందిన పశువు చనిపోతే రూ. 30 వేలు ఇస్తారు. ఇది కూడా ఒక కుటుంబానికి ఒకటి నుంచి ఆరు పశువుల వరకు నష్టపరిహారం వర్తిస్తుంది. తర్వాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు.  

గొర్రెలకు సంబంధించి ఇలా... 
ఒకే సారి మూడు గొర్రెలు చనిపోతే ఒక్కోదానికి రూ. 6 వేల చొప్పున 18 వేల రూపాయలు ఇస్తారు. ఒకటి, రెండు గొర్రెలు, మేకలు చనిపోతే మాత్రం డబ్బులు రావు. ఇందులో కూడా ఒక కుటుంబానికి 20 గెర్రెల వరకు నష్టపరిహారం వస్తుంది. తరువాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు. ఇందులో పిడుగు, విద్యుత్‌ షాక్‌లతో చనిపోతే మాత్రం కచ్చితంగా పంచనామా చేయాలి.

ప్రమాదంలో చనిపోతే మాత్రం ఎఫ్‌ఐఆర్‌ ఉండాలి. దీంతోపాటు పాడి గేదెలు,ఆవులు, గొర్రెలు, మేకలు చనిపోతే కచ్చితంగా ఆ గ్రామల పరిధిలోని గ్రామీణ పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయాలి.అందుకు సంబంధించిన రిపోర్టు ఉండాలి. దీంతోపాటు పోస్టుమార్టం చేసిన పశువుతోగానీ, గొర్రెతో గాని డాక్డర్‌ ఫొటో ఉంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే రావు. సంబంధిత డబ్బులు నేరుగా బాధితుడి ఖాతాకు జమ అవుతాయి.  

పశు వైద్యులకు సమాచారం ఇవ్వాలి... 
పశువులు, ఆవులు గొర్రెలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే సంబంధిత విషయాన్ని పశుశైద్యాధికారికి తెలియజేయాలి. అయన అక్కడి నుంచే వివరాలను జియోట్యాగ్‌ చేయాలి.

దీంతోపాటు పోస్టుమార్టం చేసి మూగజీవాల ఫొటోలు తీయాలి. పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉండాలి. ఇవేవీ లేకపోతే నష్టపరిహారం రాదు. ఇది కూడా పాడిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.  
 – డాక్టర్‌. తెలుగు. వెంకటరమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి.   

మరిన్ని వార్తలు