నూతన  ఒరవడి.. పశువిజ్ఞాన బడి

13 Nov, 2022 11:10 IST|Sakshi

జిల్లాలో అన్ని మండలాల్లో వారం వారం నిర్వహణ

జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు   721 కార్యక్రమాలు పూర్తి

పశువుల ఆరోగ్యానికి భరోసా

పాడిరైతులకు వివిధ అంశాలపై అవగాహన

కడప అగ్రికల్చర్‌ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతోపాటు పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్‌బీకేల పరిధిలో సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలను అందిస్తోంది.ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉండే గ్రామీణ ప్రాంత పశువులకు సైతం మెరుగైన వైద్యసేవందించాలనే లక్ష్యంతో సంచార పశు వైద్య శాలలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరింత భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం ‘పశువిజ్ఞాన బడి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తూ తద్వారా వేలాదిమంది రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది.  

జిల్లాలో జూన్‌ నెల నుంచి... 
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ నుంచి పశువిజ్ఞాన బడులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 414 రైతుభరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 17 ప్రాంతీయ పశువైద్యశాలలు, 79 పశువైద్యశాలలు, 78 గ్రామీణ పశువైద్యశాలలు పరిధిలో పనిచేసే పశువైద్యులు, సహాయ సంచాలకులు జూన్‌ నుంచి నవంబర్‌ 10వ తేదీ నాటికి 721 పశు విజ్ఞాన బడులను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పశువిజ్ఞాన బడులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు.  

ఏ అంశాలపై అవగాహన కల్పిస్తారంటే.. 
పాల ఉత్పత్తి పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి పశుగ్రాసాన్ని, పశుధాణాను వాడుకోవాలి. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు ఎంతమేర పచ్చిమేత అవసరం, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు. పాడి పశువులకు దాణామృతం, సమీకృత దాణా ఎలా ఇవ్వాలో కూడా అవగాహన కల్పిస్తారు.  

పాడి పశువుల్లో ఏడాదికి ఒక ఈత ఉండాలి. ఆప్పుడే పాడి పరిశ్రమలో రాణించే అవకాశం ఉంటుంది. ఈనిన దూడ కూడా ఆరోగ్యంగా వస్తుంది.  
పాడిపశువులకు సంబంధించి దూడల మరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన సంరక్షణ పద్ధతుల గురించి తెలియచేస్తారు.  
కొన్ని ఆవులు, పశువులు యెదకు రాకుండా, చూలు కట్టకుండా ఉంటాయి. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేస్తారు  
శాస్త్రీయంగా గొర్రెలు, మేకలు పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టాలో కూడా అవగాహన కల్పిస్తారు.  

రైతులకు ఎంతో ప్రయోజనం 
జిల్లాలోని అన్ని మండలాల రైతు భరోసా కేంద్రాల పరిధిలో పశు విజ్ఞానబడి కార్యక్రమాన్ని పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్థిస్థాయిలో వారు అవగాహన కల్పిçస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పశు సంరక్షక్‌ యాప్‌లో వారం వారం పొటోలు, హాజరైన రైతుల పేర్లు, వారి ఫోన్‌ నంబర్లను ఆప్‌లోడ్‌ చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది.  
– శారదమ్మ, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి.  

మరిన్ని వార్తలు