Viral: సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌ 

4 Dec, 2022 09:01 IST|Sakshi
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఆపరేషన్‌ చేయించుకున్న పెద్ద ఆంజనేయులు 

సాక్షి, గుంటూరు: ఎనిమిదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. గతంలో నెలకు రెండుసార్లు, వారానికి ఒకసారి మాత్రమే ఫిట్స్‌ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజులోనే రెండు, మూడుసార్లు ఫిట్స్‌ వస్తున్నాయి. అయితే ఆపరేషన్‌ అంటే భయపడిపోయిన రోగికి తనతో మాట్లాడుతూ మెలకువగా ఉండి కూడా ఆపరేషన్‌ చేయించుకోవచ్చని అవేక్‌ సర్జరీలలో బాహుబలి సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూరోసర్జన్‌ భరోసా ఇచ్చారు.

వెంటనే రోగి తనకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూపిస్తూ తనకు ఆపరేషన్‌ చేయాలని కోరాడు. రోగి మెలకువగా ఉండగానే రోగికి ఇష్టమైన సీఎం ప్రమాణస్వీకార వీడియోలను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ బాహుబలి సర్జన్‌ ఆపరేషన్‌ చేశారు. శనివారం గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్‌ న్యూరోసర్జన్‌  డాక్టర్‌ భవనం హనుమశ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 

రూ.4లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ ఆరోగ్యశ్రీలో ఉచితంగా.. 
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండటం ఇసుకత్రిపురవరం గ్రామానికి చెందిన 43 ఏళ్ల గోపనబోయిన పెద్ద ఆంజనేయులు రోజువారి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఇతను ఫిట్స్‌ బాధపడుతున్నాడు. గతంలో నెలలో రెండు సార్లు లేదా వారంలో ఒకసారి మాత్రమే ఫిట్స్‌ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజుకు మూడుసార్లు ఫిట్స్‌ వస్తూ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఫిట్స్‌తో పాటుగా బ్రెయిన్‌లో సుమారు ఏడు సెంటిమీటర్ల పరిమాణంలో ట్యూమర్‌ ఏర్పడింది.


ఆపరేషన్‌ చేయించుకున్న పెద్ద ఆంజనేయులుతో వైద్యులు భవనం హనుమశ్రీనివాసరెడ్డి, త్రినాథ్‌

ట్యూమర్‌ వల్ల కాలు చేయి పటుత్వం కోల్పోయి వస్తువులేమీ చేతితో పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పలు ఆస్పత్రుల్లో మందులు వాడినా సమస్య తగ్గలేదు. గత నెలలో గుంటూరులోని తమ ఆస్పత్రికి రోగి వచ్చాడని డాక్టర్‌ భవనం హనుమశ్రీనివాసరెడ్డి చెప్పారు. అతడికి ఎమ్మారై స్కానింగ్, బ్రెయిన్‌ తీడీ మ్యాప్‌ టెక్నాలజీ చేసి బ్రెయిన్‌లో అతిసున్నిత భాగమైన ఫ్రాంటల్‌ ప్రీమోటార్‌ ఏరియా నుంచి మిడిల్‌ ప్రాంటల్‌ గైరస్‌ వరకు సుమారు ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో ట్యూమర్‌ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అతి సున్నితమైన భాగాల్లో ట్యూమర్‌ ఉండటం వల్ల మెలకువగా ఉండి(అవేక్‌ సర్జరీ) ఆపరేషన్‌ చేయించుకుంటే బాగా ఉపయోగముంటుందని రోగికి కౌన్సెలింగ్‌ చేశామని తెలిపారు.
చదవండి: (మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం) 

రోగి అవేక్‌ సర్జరీకి అంగీకరించటంతో అత్యాధునికమైన న్యూరో నావిగేషన్‌ బ్రెయిన్‌ త్రీడీ మ్యాపింగ్‌ అడ్వాన్స్‌డ్‌ మైక్రోస్కోప్‌ ఉపయోగించి నవంబర్‌ 25న ఆపరేషన్‌ చేశామన్నారు. ఆపరేషన్‌ చేసేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో రోగి కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను చూపించి రోగితో మాట్లాడుతూ విజయవంతంగా ఆపరేషన్‌ చేశామని చెప్పారు. సుమారు రూ.4లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశామన్నారు.

ఆపరేషన్‌ ప్రక్రియలో తనతోపాటుగా న్యూరో ఎనస్థటిస్ట్‌ డాక్టర్‌ త్రినాథ్, పీజీ వైద్య విద్యార్థి డాక్టర్‌ ఆకాష్‌, వైద్య సిబ్బంది రెడ్డి, నరేందర్‌ పాల్గొన్నట్లు వెల్లడించారు. సకాలంలో ఆపరేషన్‌ చేయని పక్షంలో రోగికి బ్రెయిన్‌లో ట్యూమర్‌ పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని తెలిపారు. అవేక్‌ సర్జరీ విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యబృందాన్ని శ్రీసాయి హాస్పటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వసంత కృష్ణప్రసాద్‌ అభినందించారు. తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు పెద్ద ఆంజనేయలు, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తమకు లేదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు