త్వరలో చక్కెర బకాయిల చెల్లింపు

1 Oct, 2021 04:58 IST|Sakshi
సమావేశంలో మంత్రులు గౌతంరెడ్డి, కన్నబాబు, బొత్స, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య

వర్చువల్‌ విధానంలో మంత్రుల బృందం భేటీ 

మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపైనా చర్చ  

సాక్షి, అమరావతి:  చెరుకు రైతులకు క్రషింగ్‌.. ఆ కర్మాగారాల్లోని ఉద్యోగుల జీతభత్యాల బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, నిర్వహణ ఇతర అంశాలపై కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డిలతో ఏర్పాటైన మంత్రుల బృందం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌–జీఓఎం) గురువారం వర్చువల్‌ విధానంలో సమావేశమైంది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన చక్కెర నిల్వల అమ్మకాలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు, వీఆర్‌ఎస్‌ అమలు, తదితర అంశాలపై చర్చించారు. వీటి చెల్లింపుల నిమిత్తం.. పేరుకుపోయిన చక్కెర నిల్వలు అమ్మేందుకు హైకోర్టు అనుమతినివ్వడంపట్ల హర్షం వ్యక్తంచేసిన మంత్రుల బృందం సాధ్యమైనంత త్వరగా మంచి రేటుకు ఈ నిల్వలను అమ్మే విషయమై చర్చించారు.  

3.85 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలు 
రాష్ట్రంలోని ఐదు చక్కెర కర్మాగారాల్లో ప్రస్తుతం 3.85 లక్షల క్వింటాళ్ల పంచదార నిల్వలున్నాయని, వాటి అమ్మకాల ద్వారా కనీసం రూ.127 కోట్లు ఆదాయం వస్తుందని ఈ భేటీలో అంచనా వేశారు. ఒక్క చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీలోనే 3.28 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయని, వీటి అమ్మకం ద్వారా రూ.108.24 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కతేల్చారు. అక్టోబర్‌ 5న టెండర్లు పిలిచేందుకు చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక చోడవరం, ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాల్లో రైతులకు చెల్లించాల్సిన క్రషింగ్‌ బకాయిలు రూ.46.48 కోట్లు ఉన్నాయి. ఈ కర్మాగారాలతో పాటు భీమసింగి చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25.50 కోట్లు.  

సీఎంతో భేటీ తర్వాతే ముందుకు.. 
ఇక మూతపడ్డ చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అమలు, చోడవరం, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీల ఆధునీకరణ అంశాలపై సీఎం జగన్‌తో సమావేశమైన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ముందుకెళ్లాలని మంత్రుల బృందం ఈ భేటీలో నిర్ణయించింది. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ షుగర్స్‌ వెంకట్రావు  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు