ఊరందరిదీ ఒకటే మాట!

28 Jan, 2021 10:20 IST|Sakshi
పెదపట్టపుపాలెంలో పెద్దలు నిర్ణయాలు తీసుకునే చెట్టు సెంటర్‌

అక్కడ పంచాయతీ ఎన్నిక అంటే ఏకగ్రీవమే

ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల ఊసు లేదు

ఆదర్శ గ్రామం ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం  

ఉలవపాడు: పెదపట్టపుపాలెం.. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార గ్రామం. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదంటే అతిశయోక్తికాదు. ఇప్పటి వరకు సర్పంచ్‌లందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. పెద్దలందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉంటారు. పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయాలు జరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం కూడా లేకుండా చేస్తారు. తొలుత చాకిచర్ల నుంచి 1998లో పెదపట్టపుపాలెం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఆ తరువాత నాలుగు సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన ఎన్నికల్లో ప్రళయ కావేరి సుబ్రమణ్యం, 2003లో ఆవుల జయరాం, 2008 లో వాయల పోలమ్మ, 2013 లో తుమ్మల తిరుపతమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న రెండు శతాబ్దాల నాటి చెట్టు కింద కూర్చుని గ్రామస్థులందరూ కలసి కాపుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..

పెదపట్టపుపాలెం గ్రామం వ్యూ .. 

ఆదర్శప్రాయం...  
పెదపట్టపుపాలెం గ్రామం విడిపోయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇటీవల సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియతో సహా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎంపీటీసీ ఎన్నికలు జరగాయి. అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 4239. ఇందులో 2147 మంది పురుషులు, 2098 మంది మహిళలు. 3070 మంది ఓటర్లలో 1574 మంది పురుషులు, 1496 మంది మహిళలు ఉన్నారు. ఇంత మంది ఓటర్లు ఉన్నా అందరూ కలసికట్టుగా ఒకే నిర్ణయానికి కట్టుబడుతున్నారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవానికి నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల నిధులు కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. ఈ సారీ ఏకగ్రీవమే అయితే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నజరానా అందే అవకాశం ఉంది. ఇలా ఈ గ్రామం వివాదాలకు తావులేకుండా ఎన్నికల వ్యయం ప్రభుత్వానికి భారం కాకుండా ఆదర్శవంతంగా నిలుస్తోంది. చదవండి: ఎలక్షన్‌ ఎక్సర్‌సైజ్‌ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు!

పెద్దల మాటకు గౌరవం..: 
ఇక్కడ గ్రామçస్థులు పెద్దల మాటకు గౌరవం ఇస్తారు. అధికారులకు కూడా సమస్యలు రాకుండా చూస్తారు. ఇక్కడ పని చేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. 
– మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శి 

మరిన్ని వార్తలు