రోడ్లన్నింటినీ బాగు చేస్తాం

7 Sep, 2021 05:02 IST|Sakshi

రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

చంద్రబాబు కంటే సీఎం జగన్‌ ఎక్కువ రోడ్లు వేయించారు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

సాక్షి, అమరావతి: మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ బాగు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్టోబర్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే వైఎస్‌ జగన్‌ పాలనలో వేసిన రోడ్లే అధికమన్నారు. రోడ్లపై ప్రతిపక్ష నేతల ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద సోమవారం మంత్రి పెద్దిరెడ్డి.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక దేవుడి దయ వల్ల ఏటా మంచి వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. రోడ్ల పనులకు రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే అధికంగా పంచాయతీరాజ్‌ రోడ్లు వేశామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 330 కిలోమీటర్లు మాత్రమే రోడ్లు వేశారని గుర్తు చేశారు. తాము 3,185 కిలోమీటర్ల రోడ్ల పనులకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే దాన్ని భూతద్దంలో చూపించడం టీడీపీ, దాని తోక పార్టీ జనసేనకు బాగా అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌ అంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. విజిలెన్స్‌ కమిటీలు ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేశామన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 

టీడీపీ రోడ్లను గాలికొదిలేసింది: మంత్రి శంకర్‌ నారాయణ
గత టీడీపీ ప్రభుత్వం రోడ్లను అభివృద్ధి చేయకుండా గాలికొదిలేసిందని మంత్రి శంకర్‌ నారాయణ ధ్వజమెత్తారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో చేపడుతున్నామన్నారు. విశాఖపట్నంలో షీలానగర్‌ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టిపెట్టామని తెలిపారు.   

మరిన్ని వార్తలు