ఎంపీడీవోలకు పదోన్నతులు

6 Aug, 2021 03:31 IST|Sakshi

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిష్కారం

18,500 మంది పదోన్నతులకు అవకాశం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి

మెమో విడుదల.. ఉద్యోగ సంఘాలు హర్షం  

సాక్షి, అమరావతి: అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించలేదని చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగుల పక్షపాతిగా వెంటనే సమస్యను అర్థం చేసుకున్నారని చెప్పారు. పదోన్నతులకు ఉన్న ఆటంకాన్ని వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 12 కేడర్లకు చెందిన 18,500 మంది పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారిలో విశ్వాసాన్ని కలిగించారన్నారు. తాజాగా పదోన్నతులు పొందిన 255 మంది ఎంపీడీవోలను మంత్రి అభినందించారు.

లోపాలను సవరించుకోవాలని చెప్పడం తప్పా? 
ఏ పరిశ్రమ అయిన నిబంధనల ప్రకారమే పని చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అదనపు ప్రయోజనాల కోసమే అమరరాజా పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్లాలనుకుంటోందన్నారు. అమరరాజా పరిశ్రమ వల్ల కాలుష్య సమస్య ఉందని పీసీబీ, ఎన్జీటీ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏ రసాయనిక పరిశ్రమ అయినా నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వేరే చోటికి తరలించాలని నిబంధనలుంటాయని, దానిని ఎవరైనా అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తూ, సీఎంపై బురద చల్లాలని చూడటం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రం నుంచి పరిశ్రమ తరలిపోవాలని కోరుకుంటుందా? అని మంత్రి ప్రశ్నించారు. తాము కూడా తమ జిల్లా నుంచి పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోమన్నారు. లోపాలను సవరించుకుని, నిబంధనలు పాటించాలని కోరడం తప్పా? అని  ప్రశ్నించారు. 

5:3:3 నిష్పత్తిలో పదోన్నతులు..
రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంపీడీవోల పదోన్నతికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. పదోన్నతి విధానం లేక 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే పరిష్కారం సూచిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రమోషన్లలో సీనియారిటీ వివాదాలను పరిష్కరిస్తూ మధ్యేమార్గంగా మూడు కేటగిరీలైన.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఎంపీడీవోలు, ప్రమోట్‌ ఎంపీడీవోలు, ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిన ఎంపీడీవోలకు 5:3:3 నిష్పత్తిలో పదోన్నతి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు