త్వరలో మరింత విద్యుత్‌ 

2 May, 2022 03:45 IST|Sakshi

15 నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నాం 

మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి  

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నామని, దీంతో త్వరలోనే మరింత విద్యుత్‌ అందుబాటులోకొస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం విద్యుత్‌ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

అనూహ్యంగా విద్యుత్‌ కొరత ఏర్పడినా, భవిష్యత్‌లో భారీగా డిమాండ్‌ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.  ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ కొరత తాత్కాలికమేనని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పవర్‌ ఎక్సే్చంజ్‌లో యూనిట్‌ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్‌ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.   

నేడు టెండర్లకు ఆహ్వానం  
కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో(800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచేందుకు ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇప్పటికే లక్ష టన్నులు దిగుమతి చేసుకున్న (ఇంపోర్టెడ్‌) మెరుగైన గ్రేడ్‌ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్‌కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్‌ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లను సోమవారం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు.

ఈ ప్రక్రియను నెలలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణపట్నం ఫేజ్‌–2 ప్లాంట్‌ను ఈ నెలాఖరుకుగానీ, జూన్‌ మొదటి వారానికి గానీ ప్రారంభించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు బి.శ్రీధర్‌  చెప్పారు. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్షలో ఏపీ ట్రాన్స్‌ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్‌.హరనాథరావు, జె.పద్మజనార్దన్‌ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్‌ కో డైరెక్టర్‌ ఏవీకే భాస్కర్, జెన్‌ కో డైరెక్టర్లు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు