నాణ్యమైన విద్యుత్‌తోనే పెట్టుబడులు

5 Sep, 2022 04:07 IST|Sakshi

విద్యుత్‌ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామిక రంగానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. విద్యుత్‌ శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్రానికి గడిచిన రెండున్నరేళ్లలో కొత్తగా రూ.24,956 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. జనవరి 2020 నుంచి జూన్‌ 2022 మధ్య పెట్టుబడులు పెట్టేందుకు 129 మెగా యూనిట్లు ఒప్పందాలు చేసుకున్నాయని వివరించారు. విద్యుత్‌ రంగం బలోపేతానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రం పారిశ్రామిక హబ్‌గా మారుతోందని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయని, ఇదే సమయంలో విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. విశాఖ సర్కిల్లో ఐదేళ్లుగా విద్యుత్‌ వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.  సత్వర ఆర్థికాభివృద్ధికి ఇదే నిదర్శనం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.  

టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి..  
అత్యంత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను అందిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులొస్తాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో విద్యుత్‌ను సరఫరా చేయాలంటే సరికొత్త అంతర్జాతీయ టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ది ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌(టెరి) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల మద్దతుతో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు సరికొత్త టెక్నాలజీలను అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌ కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు.     

మరిన్ని వార్తలు