పట్టణాల్లో నగర వనాలు 

3 Jun, 2022 05:28 IST|Sakshi

ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగర వనాలు

అటవీ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశిం చారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగర వనాలు, 7 టెంపుల్‌ ఎకో పార్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగర వనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.  

పులులు పెరుగుతున్నాయి..
రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. నల్లమల నుంచి శేషాచలం వరకు పులుల సంచారం ఉందని మంత్రి తెలిపారు. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కూడా పులి సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. అటవీ ప్రాంతా ల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు. యూకలిప్టస్‌ సాగు చేస్తున్న రైతులకు టన్నుకు రూ.4,050 ధర లభిస్తోందని.. దీన్ని మరింత పెంచేందుకు ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌లను పెంచాలని సూచించారు.  అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్రానికి విదేశీ బొగ్గు
విదేశాల నుంచి 31 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.  దేశంలో అన్ని విద్యు త్‌ ప్లాంట్లలానే.. రాష్ట్రంలోని విద్యుత్‌ ప్లాంట్లలో కూడా రెండు, మూడు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ బొగ్గు కొనుగోళ్లు చేపట్టడం ద్వారా బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కృష్ణపట్నం మూడో యూనిట్‌ను సెప్టెంబర్‌ కల్లా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీతేజ్, డిప్యూ టీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డైరెక్టర్‌ కె.ముత్తుపాండ్యన్, డిస్కంల సీఎండీలు  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు