పారదర్శకంగా ఇసుక విధానం

12 Sep, 2022 03:59 IST|Sakshi

చంద్రబాబు పాలనలో రూ.4 వేల కోట్లు ఇసుక దందా: మంత్రి పెద్దిరెడ్డి 

అడ్డుకున్న వనజాక్షిపై చింతమనేని దాడిని ఎవరూ మరచిపోలేదు 

అక్రమ తవ్వకాలపై నాడు టీడీపీ సర్కారుకు ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా

తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇసుక విధానం పారదర్శకంగా అమలవుతోందని అటవీ, విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దందాను అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుత్తు పట్టుకుని దాడి చేశారని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో రూ.4 వేల కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో టూరిస్టు బోటు తిరగబడి ఆరుగురు చనిపోయిన ఘటన కూడా టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. నాడు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చంద్రబాబు సర్కారుకు రూ.వంద కోట్లు జరిమానా విధించడం టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు కనపడలేదా? అని ప్రశ్నించారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే
పేదల సంక్షేమం కోసం వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్‌   ప్రకటించారని చెప్పారు. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఇక నేతలదే ఇసుక’ అంటూ ఈనాడు పత్రికలో పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలోనే సీఎం జగన్‌ 99 శాతం అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టో ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం మినహా ప్రజా సంక్షేమం చంద్రబాబుకు పట్టదని ధ్వజమెత్తారు.  

ఓటుకు కోట్లు నిర్వాకం బాబుదే 
ఢిల్లీలో లిక్కర్‌ మాఫియాతో ముఖ్యమంత్రి కుటుంబానికి ముడిపెడుతూ ఎల్లో మీడియా కథనాలు రాస్తోందని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో పట్టపగలే సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు నీచ రాజకీయాల కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న మహిళను రాజకీయాల్లోకి లాగడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పి.అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఎంఆర్‌సి రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు