రాష్ట్రంలో కొత్తగా 100 ఎకో టూరిజం ప్రాజెక్టులు

16 Nov, 2022 03:26 IST|Sakshi

అటవీ శాఖ ప్రతి డివిజన్‌లో కనీసం 5 చొప్పున ఏర్పాటు 

మూడు నెలల్లో కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వంద పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) ప్రాజెక్టులను ప్రారంభించాలని అటవీ శాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అటవీ శాఖ డివిజన్‌ పరిధిలో కనీసం 5 ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు నెలకొల్పాలని సూచించారు.

విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి చెప్పారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్‌ వరకు ట్రామ్‌ లేదా రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జన నష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగనన్న లేఅవుట్లలో నాటేందుకు మొక్కలను సమకూర్చాల్సి ఉందన్నారు.   

సబ్‌ స్టేషన్ల నిర్మాణంలో వేగం పెరగాలి 
రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి కొన్నిచోట్ల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, మూడు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఇంధనశాఖ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్‌ పరిధిలోని అర్హులైన రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోందని, దీనిపై సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్‌ను సబ్సిడీపై అందిస్తున్నాం, జోన్‌ పరిధిలో ఎంత డిమాండ్‌ ఉందనే వివరాలను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు