చిత్తడి నేలల సమాచారానికి కమిటీ

29 Sep, 2022 06:50 IST|Sakshi

2 నెలల్లో కమిటీ నివేదిక  

వెట్‌ల్యాండ్‌ బోర్డు తొలి సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి  

సాక్షి, అమరావతి: చిత్తడి నేలల గురించి నిర్దిష్టమైన సమాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, అటవీశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో కూడిన వెట్‌ ల్యాండ్‌ బోర్డ్‌ తొలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండునెలల్లో ఈ కమిటీ ప్రాథమిక నివేదికను వెట్‌ ల్యాండ్‌ బోర్డుకు సమర్పిస్తుందని తెలిపారు.

ప్రజల జీవనోపాధికి విఘాతం లేకుండా అలాగే చిత్తడి నేలల్లో జీవజాలం మనుగడకు ముప్పులేకుండా వెట్‌ ల్యాండ్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని 30 వేల ఎకరాల్లో చిత్తడి నేలలు ఉన్నట్లు గుర్తించిందన్నారు. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నేలల్లో కొంతమేర ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.

కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2వ కాంటూరు వరకు చేపల చెరువులు విస్తరించాయన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సీజనల్‌గా వ్యవసాయం, ఇతర పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ అనేక రకాల జంతువులు, పక్షులు, జీవజాలం మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. 

కొల్లేరు, నేలపట్టు, పులికాట్, కోరింగ, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో చిత్తడి నేలలున్నట్లు తెలిపారు. అరుదైన విదేశీపక్షులు వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చి కొల్లేరు, పులికాట్‌ ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని చెప్పారు. చిత్తడి నేలల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందని, వాటి ఆధారంగా రాష్ట్రంలోను వెట్‌ ల్యాండ్‌ బోర్డు ఏర్పాటైందని తెలిపారు.

అటవీ అధికారులు చిత్తడి నేలల సంరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధి
కారులు ఎ.కె.ఝా, శాంతిపాండే తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు