సమన్వయంతో ముందుకు..

28 Jul, 2020 04:37 IST|Sakshi

ఆదాయం పెంపే లక్ష్యం 

మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని భూగర్భ గనులు, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఆయన భూగర్భ గనుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన సూచించిన ముఖ్యాంశాలు.. 
► రెవెన్యూ పెంచడానికి జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలి. 
► గ్రావెల్‌ తవ్వకాల విషయంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. 
► రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. 
► మైనింగ్‌ అధికారుల అనుమతి లేకుండా ఖనిజం ఎగుమతి కావడానికి వీల్లేదు. 
► ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో  ఆదాయం పెంపునకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.  

గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా  
► జిల్లా స్థాయి అధికారులు గనుల శాఖ ప్రతిష్ఠ పెంచేలా పనిచేయాలి. 
► నిర్ణీత గడువు ఉండేలా జిల్లాల వారీగా మైనింగ్‌ యాక్షన్‌ ప్లాన్‌ íసిద్ధం చేయాలి.  
► అవసరమైన సిబ్బందిని, వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఆకస్మిక తనిఖీలు చేయాలి. చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి.  

నాటే మొక్కకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు 
జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటిన మొక్కకు రక్షణగా ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉపాధి పథకం అమలుపై ఆయన ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 
► మొక్కల పర్యవేక్షణను సచివాలయాల సిబ్బంది సహాయంతో జిల్లా డ్వామా పీడీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు.  
► గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.  
► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, డైరెక్టర్‌ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  

నిర్ణయాలివీ... 
► అన్ని పోర్టుల్లో రాయల్టీ ఇన్‌స్పెక్టర్లను నియమించాలి. 
► పొరుగు రాష్ట్రాల నిబంధనలను అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలి. 
► ప్రభుత్వం ఇచ్చే ఇళ్లస్థలాలకు మొరం, గ్రావెల్‌ లెవలింగ్‌ విషయంలో అక్రమాలు జరగకుండా నిఘా వేయాలి. 
► కోవిడ్‌ కారణంగా మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని,  వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఐరన్‌ఓర్, లెడ్, లైమ్‌స్టోన్‌లకు సంబంధించి 283 లీజులు పనిచేయడం లేదని అధికారులు వివరణ ఇచ్చారు. 
► సుదీర్ఘంగా జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,  గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు