విద్యుత్‌ సేవల్లో విఫలమైతే జరిమానా

7 Jun, 2021 04:46 IST|Sakshi

గడువులోగా కనెక్షన్‌ ఇవ్వాల్సిందే

తప్పుగా సర్వీస్‌ తొలగిస్తే తస్మాత్‌ జాగ్రత్త

విపత్తు వేళా పునరుద్ధరణ తేదీ చెప్పాల్సిందే

కరెంట్‌ సేవలపై ఇక ఏపీఈఆర్‌సీ నిఘా నేత్రం

డిస్కమ్‌ల నుంచి మూడు నెలలకోసారి నివేదిక

పారదర్శక సేవల కోసం విప్లవాత్మక మార్పులు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థలు ఇక నుంచి మరింత జవాబుదారీతనంతో వ్యవహరించనున్నాయి. వినియోగదారులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించినా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున బాధ్యతాయుతంగా మెలగనున్నాయి. వివరంగా చెప్పాలంటే తమ తప్పును ఒప్పుకుని మరీ వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఊపిరి పోసింది. విద్యుత్‌ వినియోగదారులకు బ్రహ్మాస్త్రం లాంటి ఈ సంస్కరణలను అధికారిక గెజిట్‌లో కూడా ప్రకటించినట్టు ఏపీఈఆర్‌సీ ఆదివారం మీడియాకు తెలిపింది. ఇది ఈ నెల 4వ తేదీ నుంచే అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. మరో కీలక విషయం ఏమిటంటే దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో నివేదికను ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది.  

కనెక్షన్‌ తప్పుగా తొలగిస్తే..
నిజానికి విద్యుత్‌ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గతంలోనే చట్టాలొచ్చినా విద్యుత్‌ సంస్థలు పెడచెవిన పెట్టడంతో పరిహారం కోరే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోందని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావించిన కమిషన్‌ బలమైన చట్టాలకు పదును పెట్టినట్లు వెల్లడించింది.  
► ఇక నుంచి విద్యుత్‌ సంస్థలకు సంబంధించి ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌ అందుబాటులో ఉండాలి. దీనివల్ల కరెంట్‌ పోతే తక్షణమే ఫిర్యాదు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకూ సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులున్నాయి.  
► ఎవరైనా కొత్త కనెక్షన్, అదనపు లోడ్‌ కోరితే విద్యుత్‌ సంస్థలు తక్షణమే తగిన సమాచారం అందించాలి. నిర్ణీత గడువులోగా డిమాండ్‌ను నెరవేర్చాలి.  
► సర్వీస్‌ కనెక్షన్‌ను తప్పుగా తొలగించినా, కనెక్షన్‌ తొలగించకుండా తిరిగి కనెక్షన్‌  చార్జీలు వసూలు చేసినా సర్వీసు వైఫల్యం కింద పరిగణించాలి. ఇది క్షమించరాని నేరంగా విద్యుత్‌ సంస్థలు గుర్తించి తక్షణమే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.  

ప్రతి మూడు నెలలకు నివేదిక..
విద్యుత్‌ సేవల్లో లోపం కారణంగా చెల్లించిన జరిమానా వివరాలను ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణ మండలి స్వయంగా పరిశీలిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వివరాలను పంపాలని గెజిట్‌లో పేర్కొంది. వైఫల్యానికి కారణాలను కూడా కమిషన్‌కు వెల్లడించాలి. కారణాలు సహేతుకం కాదని భావిస్తే పరిహారం చెల్లించాలని కమిషన్‌ ఆదేశించే వీలుంది.

విపత్తుల సమయంలోనూ..
ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్‌ సేవలకు అంతరాయాలు కలగడం సహజం. అయితే సేవల పునరుద్ధరణ ఏ తేదీన జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ పంపిణీ సంస్థలు బహిరంగ ప్రకటన జారీ చేయాలని కమిషన్‌ పేర్కొంది. చెప్పిన తేదీలోగా విద్యుత్‌ ఇవ్వకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి. సేవలు కొనసాగించలేని స్థితిని సహేతుకమని కమిషన్‌ భావిస్తే పరిహారం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.  

విప్లవాత్మక సంస్కరణలు..
‘ఇవి విప్లవాత్మక సంస్కరణలు. డిస్కమ్‌లు సేవలపై మరింత దృష్టి పెడతాయని ఆశిస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తేవాలని డిస్కమ్‌లను ఆదేశించాం. పంపిణీ సంస్థల పనితీరు సమాచారాన్ని కమిషన్‌ సమీక్షించి వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టింది. మరింత మేలైన సేవలు అందించేందుకే ఈ ప్రయత్నం’’.
– జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి,ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు