54.69 లక్షల మందికి తొలిరోజే పింఛను

2 Jun, 2022 03:53 IST|Sakshi
ఒంగోలులోని మంగమూరు రోడ్డులో చెన్నమ్మకు పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ కాశీరత్నం

90.02 శాతం మంది లబ్ధిదారులకు రూ.1,390.53 కోట్లు అందజేత 

ఆన్‌లైన్‌ బయోమెట్రిక్‌ విధానంలో 53,69,548 మందికి పింఛన్లు   

కోనసీమలో దాదాపు లక్షమందికి ఆఫ్‌లైన్‌లో పంపిణీ   

సాక్షి, అమరావతి/దేవరాపల్లి: ఎండలు మండుతున్నా అవ్వాతాతలకు చిన్న కష్టం కూడా తెలియకుండా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. జూన్‌ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,75, 256 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం  రూ.1,543.80 కోట్లను విడుదల చేసింది. ఒకటో తేదీనే 90.02 శాతం మందికి డబ్బుల పంపిణీ పూర్తయింది. ఆన్‌లైన్‌ బయోమెట్రిక్‌ విధానంలో 53,69,548 మందికి రూ.1,364.53 కోట్లు పంపిణీ చేశారు.

కోనసీమ జిల్లాలో పలు మండలాల్లో ఇంటర్‌నెట్‌ వసతి లేని కారణంగా మరో లక్షమంది వరకు లబ్ధిదారుల నుంచి ఆఫ్‌లైన్‌ విధానంలో వేలిముద్ర లేదా సంతకం తీసుకుని పింఛన్లు పంపిణీ చేసినట్లు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో మొత్తం 54.69 లక్షల మందికి రూ.1,390.53 కోట్లను తొలిరోజే పంపిణీ చేసినట్లు చెప్పారు.

మరో నాలుగు రోజులు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని క్యాంప్‌ కార్యాలయంలో వెల్లడించారు. 

స్వయంగా పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్‌
సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం జరిగిన నేపథ్యంలో గత నెల 24వ తేదీ నుంచి ఇంటర్‌నెట్‌ సేవల్ని నిలిపేశారు. కొన్ని మండలాల్లో మాత్రం ఈ సేవల్ని పునరుద్ధరించారు.

ఇంటర్‌నెట్‌ సదుపాయం నిలిపేసిన మండలాల్లో పెన్షన్‌దారులకు, రేషన్‌దారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెన్షన్‌కు, రేషన్‌కు బయోమెట్రిక్‌ అవసరం లేకుండా లబ్ధిదారుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా స్వయంగా వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రేషన్‌ను అందజేశారు.  

మరిన్ని వార్తలు