అర్జీ ఇచ్చిన 24 గంటల్లోనే పింఛన్‌

6 Oct, 2021 03:39 IST|Sakshi
స్పందన కార్యక్రమానికి అర్జీ ఇచ్చేందుకు తండ్రి నాగయ్యతో కలెక్టరేట్‌కు వచ్చిన వాసు, పెన్షన్‌ సొమ్మును అందజేస్తున్న వలంటీర్‌

చిలకలపూడి: అర్జీ ఇచ్చిన 24 గంటల్లోనే లబ్ధిదారునికి అధికారులు పింఛన్‌ అందించారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం వేమవరప్పాడుకు చెందిన వాశి వాసుకు నెల నెలా అందే వికలాంగ పింఛన్‌ రెండు నెలలు కిందట నిలిచిపోయింది. దీంతో సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి తండ్రి నాగయ్యతో కలిసి వాసు హాజరయ్యాడు. తనకు పింఛన్‌ రావట్లేదని కలెక్టర్‌ నివాస్‌కు అర్జీ ఇచ్చాడు. కలెక్టర్‌ వెంటనే స్పందించి డీఆర్డీఏ పీడీ ఎం.శ్రీనివాసరావును పిలిచి పింఛన్‌ ఎందుకు నిలిపివేశారో విచారణ చేయాలని ఆదేశాలిచ్చారు.

తల్లిదండ్రుల బియ్యం కార్డులో వాసు పేరు లేకపోవటంతోనే పింఛన్‌ ఆగిపోయిందని ఆయన విచారణలో తెలిసింది. వెంటనే పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి.. వాసు పేరును కూడా తల్లిదండ్రుల కార్డులో నమోదు చేయించారు. మంగళవారం ఉదయం వికలాంగ పింఛన్‌ రూ.3 వేలను వాసు తల్లికి సంబంధిత వలంటీర్‌ ద్వారా అందజేశారు. అర్జీ ఇచ్చిన మరుసటి రోజే డబ్బులు రావటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు