అనర్హులకు ఇచ్చేదెలా?

19 Sep, 2020 06:01 IST|Sakshi
గ్రామసభకు ఎవ్వరూ హాజరు కాకపోవడంతో ఎదురు చూస్తున్న ఎంపీడీఓ, ఉప తహశీల్దార్‌(ఫైల్‌)

ఒంటరి మహిళలకు పింఛన్లపై హైకోర్టు తీర్పుతో అధికారుల్లో ధర్మ సందేహం

అనర్హులుగా నిర్థారణ కావడంతోనే పింఛన్లు ఆపారు

ఇంటింటికీ క్షేత్రస్థాయి సర్వేతో వాస్తవాలు వెల్లడి

భర్త ఉన్నవారికి ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు ఎలా ఇవ్వాలి?  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనర్హులని కళ్లెదుటే కనిపిస్తున్నా ప్రభుత్వ పథకాలను అందించాలా? అర్హత లేకున్నా లబ్ధి చేకూర్చాలా?.. కళ్లు మూసుకుని కూర్చోవాలా? ఒంటరి మహిళలకు పింఛన్ల వ్యవహారంలో అధికారులకు ఎదురవుతున్న ‘ధర్మ’ సందేహం ఇదీ!

అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో అర్హులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఒకటికి రెండుసార్లు క్షేత్రస్థాయి సర్వేలతో నిర్థారించుకుని నేరుగా ఇంటివద్దే పథకాల లబ్ధిని అందచేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని కల్పిస్తోంది.  ఈ విధానంలో అర్హులు మిగిలిపోయే అవకాశం లేదు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒంటరి మహిళలకు పింఛన్లు నిలిపివేసిన వ్యవహారంలో 145 మంది నిజంగానే అనర్హులని క్షేత్రస్థాయి విచారణలో తేలింది. దీనికి సంబంధించి 175 మంది కోర్టును ఆశ్రయించడంతో... ఏ మహిళా భర్త ఉండగా వితంతువునని చెప్పదని, ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలుసని న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

వారికి 15 రోజుల్లోగా తిరిగి పింఛన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో మరోసారి లబ్ధిదారుల అర్హతలను పరిశీలించారు. ఈనెల 8వ తేదీన హైకోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేయగా మరుసటి రోజే గ్రామంలో విచారణ చేపట్టారు. ఈనెల 15న నిర్వహించిన గ్రామసభకు ఒక్కరు మినహా ఎవరూ హాజరు కాకపోవడంతో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. వారెవరూ ఒంటరి మహిళలు కాదని.. అనర్హులుగా నిర్ధారణ కావడంతోనే పింఛన్లు నిలిపివేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారికి పింఛన్లు ఎలా ఇవ్వాలని అధికారులు తల పట్టుకుంటున్నారు. అనర్హులని పక్కాగా తేలినప్పటికీ పింఛన్లు ఎలా ఇవ్వాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.

క్షేత్రస్థాయి సర్వేతో...
► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం బిర్లంగి పంచాయతీలో కోర్టును ఆశ్రయించిన వారిలో 27 మంది ఇప్పటికే వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా మరో ముగ్గురు తాజాగా అర్హత పొందినట్టు నిర్ధారించారు. మిగతా 145 పింఛన్లు అనర్హమైనవని తేల్చేశారు. 
► రాజుల సాహు అనే మహిళ తన భర్త నర్సింగ జీవించి ఉన్నప్పటికీ వితంతు పింఛను తీసుకుంటున్నారు. ఆ దంపతులిద్దరూ కలిసే ఉంటున్నారు. 
► టరిని బడిత్య అనే మహిళ ఒంటరి మహిళ పింఛను పొందుతోంది. అయితే ఆమె భర్త రఘునాథ్‌ బడిత్యాతో కలిసి జీవిస్తోంది. మ రోవైపు రఘునాథ్‌ బడిత్యా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటుండటం గమనార్హం.
► ఒంటరి మహిళ పింఛను తీసుకుంటున్న శశిమణి పాత్రో అనే మహిళ తన భర్త కృష్ణతో కలిసే ఉంటోంది.
► దూపాన మోహిని అనే మహిళ తన భర్త ఉమాపతి లేరని ఒంటరి మహిళ పింఛను తీసుకుంటోంది. వాస్తవానికి ఆయన జీవించే ఉండగా వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్నారు.
► ప్రతిమ అనే మహిళ ఒంటరి మహిళ పింఛను పొందుతున్నారు. కానీ అప్పటికే ఆమె అభ య హస్తం పింఛను కూడా తీసుకుంటోంది.
► లక్ష్మీ బడిత్యా అనే మహిళ వితంతు పింఛను తీసుకుంటూ భర్త చనిపోయినట్లు చూపించారు. కృష్ణ అనే వ్యక్తితో ఆమె కలసి జీవిస్తున్నారు.  
► ఒంటరి మహిళ పింఛను తీసుకుంటున్న దడ్డ జ్యోతి తన భర్త బలరాం గణపతితో కలిసే ఉంటున్నారు. ఆయన ప్రభుత్వ ఉపా«ధ్యాయు డిగా పని చేస్తున్నారు. గ్రామసభకు ఆమె ఒక్కరే హాజరయ్యారు. తాను కోర్టుకు వెళ్లలేదని అధికారులకు వివరణ ఇచ్చారు. 

నా పేరు మార్చి ఫిర్యాదు..
ఇటీవల జగనన్న మాకు రూ.పది వేలు సాయం అందచేశారు. నేను ఉంటుండగానే నా భార్య ఒంటరి మహిళా ఎలా అవుతుందో అర్థం కావడంలేదు. మాకు పింఛన్‌ కావాలని ఎవరినీ అడగలేదు. భర్తగా నా పేరు తొలగించి ‘రాజు’ అని మార్చి కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు నోటీసు ఇచ్చారు. 
– లోకనాథం శెట్టి, (దమయంతి శెట్టి భర్త), బిర్లంగి 

ఊరందరితో పాటు మాకూ..
నాకు భర్త (అప్పన్న శెట్టి) ఉన్నందున పింఛన్‌ తొలగించారు. కానీ నా భర్త చనిపోయినట్లు నోటీసులో ఉంది. పొలం పనులు ఉన్నందున గ్రామ సభకు హాజరు కాలేదు.
– శ్యామల శెట్టి, ఫిర్యాదుదారు, బిర్లంగి 

మా చెల్లి ఒంటరి కాదు..
గతంలో మా చెల్లికి వివాహానికి ముం దు పింఛన్‌ వచ్చేది. పింఛన్‌ కోసం ఎవరికీ ఫిర్యాదు చేయలేదు.
– నెయ్యిల ఘనశ్యామ్, (కున్నీ బెహరా అన్న), బిర్లంగి 

మరిన్ని వార్తలు