Andhra Pradesh: ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా 

27 Aug, 2022 12:04 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ

పెనుకొండ: ‘రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. అందుకే జనమంతా వైఎస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అండగా నిలుస్తూ అపూర్వ విజయాన్ని అందిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత     చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

చివరకు తన సొంత నియోజకవర్గం ‘కుప్పం’లోనూ ఉనికి కోల్పోవడంతో రోడ్డుపై కూర్చుని ‘డ్రామా’కు తెరతీశారు’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

అర్హత ఉంటే చాలు పథకం ఇంటికే నడిచి వస్తోందని, అందువల్లే ‘కుప్పం’ ప్రజలూ వైఎస్సార్‌ సీపీ వెంట నడుస్తున్నారన్నారు. ఈక్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టారన్నారు. దీంతో చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు.  

టీడీపీ కేడర్‌ కూడా వైఎస్సార్‌ సీపీలో చేరుతోండటంతో ఏం చేయాలో తెలియని చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. టీడీపీ నేతలే అక్కడున్న వైఎస్సార్‌ సీపీ నేతల ఫ్లెక్సీలు చించి నానా హంగామా చేస్తే వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారని, దీంతో టీడీపీ నేతలే దాడి దిగారన్నారు. కానీ చంద్రబాబు, అతని అనుచరులు కుప్పంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులే...టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారన్నారు.

అంతేకాకుండా దాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదిస్తూ నిందలు వేశారని, ఇది చంద్రబాబు దిగుజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇక ‘కుప్పం’ ఘటనను సాకుగా చూపుతూ పలుచోట్ల టీడీపీ నేతలు శాంతిర్యాలీ పేరుతో జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమానికి సిద్ధమయ్యారన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని తన సొంత సర్వేలోనూ తేలడంతో చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు తెరలేపారన్నారు.

జగనన్న ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. చంద్రబాబు తప్పును, చేతగాని తనాన్ని కప్పిపుచ్చడానికి ఆ పార్టీ నాయకులు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి ధర్నాల పేరుతో నానా యాగీ చేస్తున్నారని, ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్పితీరుతారన్నారు.

సమావేశంలో వైఎస్సార్‌ సీపీ సోమందేపల్లి మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్‌ వెంకటరత్నం, ఉప సర్పంచ్‌ వేణు, నాయకులు నరసింహమూర్తి, అశోక్, రామాంజనేయులు, ఇమాంవలి, వైస్‌ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, ఎస్‌ఎం బాషా,  ఎంపీ నాగరాజు, ట్రాక్టర్‌ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి: మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు)

మరిన్ని వార్తలు