పల్లె జనం.. పట్టణ జపం

27 May, 2022 12:58 IST|Sakshi

విద్య, ఉపాధి కోసం పట్నం బాట పట్టిన జనం

గ్రామాల నుంచి భారీగా వలసలు

1971లో పట్టణ జనాభా 17 శాతం.. ఇప్పుడు 29 శాతం

మారిపోయిన పట్టణాల రూపురేఖలు

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలనీలు

పట్టణాల్లో కలిసిపోతున్న సమీప పంచాయతీలు

సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి ­­: పల్లె తల్లి వంటిది.. అందుకే గతంలో స్వగ్రామాలను విడిచి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అంతా పట్నం బాటే పడుతున్నారు. ఫలితంగా పంటపొలాలకు లోగిళ్లుగా చెప్పుకునే పల్లెలు వివిధ కారణాలతో ఇప్పుడు పట్టణాలకు చేరువయ్యాయి. బతుకుతెరువు కోసం వచ్చి పట్టణాల్లో స్థిరపడిపోయిన కుటుంబాలు భారీగా పెరుగుతున్నాయి. ఎకరాల కొద్దీ మాగాణి భూములతో అలరారిన కుటుంబాలు సైతం ఇప్పుడు పట్టణాలను వెతుక్కుంటూ వచ్చాయి. అన్నిటికీ ఒకటే సూత్రం..బతుకుదెరువు. లేదా పిల్లల చదువులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజాగా సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. 

చదువుల కోసం నగరాలకు.. 
2000 సంవత్సరానికి ముందు ఉపాధి కోసం ఎక్కువ మంది పట్టణాలకు చేరుకునే వారు. చిన్న చితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. దీంతో పట్టణ జనాభా కొద్దికొద్దిగా పెరుగుతూండేది. 2000 సంవత్సరం తర్వాత పిల్లలను చదివించుకోవాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువైంది. దీంతో భూములను కౌలుకు ఇవ్వడం, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పట్టణాల్లో స్థిరపడి పిల్లలను చదివించుకుంటున్నారు. ఈక్రమంలోనే గడిచిన 20 ఏళ్లలో పట్టణాలకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

జిల్లా విషయానికే వస్తే అనంతపురం నగరానికి పక్కనే ఉన్న నారాయణపురం పంచాయతీ జనాభా ఒకప్పుడు 8 వేల లోపే. ప్రస్తుత లెక్కల ప్రకారం జనాభా 24 వేలు ఉందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే, హిందూపురానికి దాదాపు 5 కిలోమీటర్ల పైనే దూరముండే కొట్నూరుకూడా పట్టణంలో కలిసిపోయింది. 1991 లెక్కల ప్రకారం సదరు పంచాయతీ జనాభా 1,350 కాగా ఇప్పుడు దాదాపు 4,500 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఒక్క పంచాయతీనే కాదు సడ్లపల్లి, పూలకుంట పంచాయతీలు కూడా హిందూపురం పట్టణంలో దాదాపు కలిసిపోయాయి. 

2008 తర్వాత నుంచి భారీగా.. 
గతంలో ఇంజినీరింగ్‌ చదవాలంటే ఏ కొద్దిమందికో అవకాశం ఉండేది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య చదివే అవకాశం వచ్చింది. దీంతో పాటు మెరిట్‌ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దీంతో పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు పట్టణాలకు క్యూ కట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పుణ్యమా అని లక్షలాదిమంది ఇంజనీరింగ్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలా రకరకాల కారణాల వల్ల పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పట్టణాల్లో ఒకప్పుడు చదరపు కిలోమీటరకు 111 మంది ఉండగా..ఇప్పుడు 213కు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య 242కు చేరి ఉంటుందని అంచనా. అంటే పట్టణాలు ఎంత ఇరుకుగా మారుతున్నాయో అంచనా వేయచ్చు.

పెరిగిన కాలనీలు..  
ఒకప్పటి అనంతపురం నగరానికి ఇప్పటికీ భారీగా తేడా కనిపిస్తోంది. గతంలో పాతూరు, కొత్తూరు ప్రాంతాలు మాత్రమే ఉండేవి. శ్రీకంఠం సర్కిల్‌ వరకూ పాతూరు.. ఆ పైభాగం మొత్తం కొత్తూరుగా పిలుచుకునే వారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం పూర్తిగా నగరంలో కలిసిపోయిన పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే బళ్లారి రోడ్డుకు ఎస్టేట్‌కాలనీ, సిండికేట్‌నగర్, రాచానపల్లిపల్లి వరకూ నగరం విస్తరించింది. కళ్యాణదుర్గం రోడ్డుకు ఒకప్పడు బైపాస్‌ తర్వాత చివరన రాజా హోటల్‌ ఉండేది. అక్కడి వరకూ కూడా ఆటోలు రావాలంటే గగనంగా ఉండేది. ఇప్పుడు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల భారీ భవనాలు వెలిశాయి. కక్కకలపల్లి కాలనీ, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ, అక్కంపల్లి, ఎన్‌ఆర్‌కాలనీ, ధర్మభిక్షకాలనీ ఇలా కురుగుంట వరకూ నగరం విస్తరిచింది.  ఆలమూరు రోడ్డుకు రుద్రంపేట, కట్టకిందపల్లి రూరల్‌ మండల పరిధిలో ఉండేవి. ప్రస్తుతం ఇవి కూడా నగరంలోకి కలిసిపోయాయి. కొత్తగా ప్రభాకర్‌చౌదరి కాలనీ, పంతులకాలనీ, చంద్రబాబు కొట్టాల, వికలాంగుల కాలనీ, అజయ్‌ఘోష్‌ నగర్, ఆదర్శనగర్‌ తదితర పేర్లతో కాలనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.  

పట్టణం.. సౌకర్యవంతం
మాది సోమందేపల్లి మండలం మండ్లి పంచాయతీ రూకలపల్లి. గ్రామం కావడంతో ఉపాధి కోసం హిందూపురం పట్టణానికి 2008లో వచ్చాము. ముద్దిరెడ్డిపల్లిలో పవర్‌ లూమ్స్‌లో చీరల నేస్తూ ఇక్కడే సిర్థపడ్డాను. ఉపాధి దొరకడంతో పాటు పట్టణం కావడంతో అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. 
– రవికుమార్‌ రెడ్డి, హిందూపురం

పిల్లల ఉన్నత చదువుల కోసం వచ్చాం 
మా ఊరు పెద్దవడుగూరు మండలంలోని కిష్టిపాడు. నేను గుత్తి మండలం వన్నేదొడ్డి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం చేశా. కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. వాడికి ఇబ్బంది ఉండవద్దని ‘అనంత’కు వచ్చి స్థిరపడ్డాం.        
– మస్తాన్‌వలి, టీచర్, అనంతపురం 


 

ఒకప్పుడు పల్లె... నేడు పట్టణం  
మాది నారాయణపురం. 30 సంవత్సరాల క్రితం మాదొక పల్లెటూరు. నగరంలో నివాసముంటున్న వారి దుస్తులు తీసుకొని గాడిదలపై వేసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నగరం బాగా పెరిగింది. ఈ ఊరు నగరంలో కలిసిపోయింది. రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇప్పుడు మీ ఊరేది అంటే అనంతపురం అని చెబుతున్నాం. 
– చాకలి సుబ్బరాయుడు, నారాయణపురం పంచాయతీ 

మరిన్ని వార్తలు