ఊపిరిపీల్చుకున్న ‘అనంత’

15 Oct, 2022 08:42 IST|Sakshi

అనంతపురం : వరద తగ్గుముఖం పట్టడంతో అనంతపురం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నగరంతో పాటు శివారులోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు నుంచి దాదాపు బయటపడ్డాయి. దీంతో ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. రోడ్లు, వీధులను శుభ్రంచేయడంలో మునిసిపల్‌ కార్పొరేషన్, పంచాయతీ కార్మికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్‌ సర్వే చేపట్టారు. వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు.

పునరావాస కేంద్రాల్లోని 600 మందికి పైగా ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు తక్షణ సాయం అందజేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.2 వేల నగదు, 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ ఎర్రగడ్డలు, కేజీ బంగాళాదుంపలు ఇస్తున్నారు. మరోవైపు.. నగరంలోని జీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌తో కలిసి శుక్రవారం వరద బాధితులకు నగదు, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతపురంలో 34 వేల కుటుంబాలు, రాయదుర్గంలో 300 కుటుంబాలు వరద ప్రభావానికి గురైనట్లు గుర్తించామని కలెక్టర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు