ఈ సమయంలో ఎన్నికలా?

4 Nov, 2020 02:49 IST|Sakshi

రోజూ వేలాది కరోనా కేసులు  

యూరప్‌ దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ 

మనదేశంలోనూ సెకండ్‌వేవ్‌ భయాందోళనలు 

అయినా.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామనడంపై విమర్శలు 

ప్రజారోగ్యాన్ని పణంగా పెడతారా అంటూ ఆవేదన 

ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తీరుపై సర్వత్రా ఆగ్రహం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా వేలసంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు.. సెకండ్‌వేవ్‌ వస్తుందన్న భయాందోళనలు.. కరోనా వైరస్‌ మరింత పరివర్తన చెందుతోందన్న హెచ్చరికలు.. యూరప్‌ దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధింపు.. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌.. ఇటీవల రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశం కూడా ఒక్కొక్కరితోనే కావడం గమనార్హం. అంటే ఒకేచోట కొందరు కలిస్తే ప్రమాదమన్న భయం ఆయనకు కూడా ఉందని పేర్కొంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్ని అప్పుడూ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నా పట్టించుకోని రమేష్‌కుమార్‌ ఇప్పుడు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ నిర్వహించాలని చూడటం విమర్శనీయంగా ఉంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరమని తెలిసినా.. ఆయన ఆ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ముడిపెట్టడం భావ్యంకాదని పలువురు పేర్కొంటున్నారు.

అప్పటికన్నా విజృంభించిన కరోనా
కరోనా భయం లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైంది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మరో వారంలో ఎన్నికలు జరుగుతాయనగా కరోనా వ్యాపిస్తోందంటూ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండా రమేష్‌కుమార్‌ ఎన్నికల్ని వాయిదా వేశారు. అప్పటికి దేశం మొత్తంమీద వందకు తక్కువగా కేసులు నమోదుకాగా మనరాష్ట్రంలో కేవలం పది కేసులకన్నా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో రోజూ సుమారు మూడువేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమనడం రాజ్యాంగబద్ధంగా తీసుకునే నిర్ణయం ఎలా అవుతుందని పలువురు రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వాయిదా వేసిన ఎన్నికల నిర్వహణకు ముందుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా.. రమేష్‌ మాత్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం కూడా చర్చకు తావిచ్చింది. కరోనా భయం కారణంగానే విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించలేదు. దశలవారీగా రోజువిడిచిరోజు పద్ధతిలో తరగతులు మొదలవుతున్నాయి. 65 ఏళ్లు దాటినవారు, పిల్లలు బయటకు వెళ్లవద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రధాని మోదీ కూడా మన్‌కీ బాత్‌లో సూచించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

స్థానిక పదవులకు హోరాహోరీ..
గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, వార్డు కౌన్సిలర్‌ ఎన్నికలు స్థానిక ప్రజల మధ్య పట్టుదలతో కూడుకుని ఉంటాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఒకటి, రెండు ఓట్లు కూడా గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇంటింటి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం కల్పించేవేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చలికాలంలో మరింత వైరస్‌ ప్రభావం?
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తొమ్మిది తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో చలికాలంలో చలితీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల కన్నా చలికాలంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఈ పరిస్థితులో స్థానిక ఎన్నికల నిర్వహణ సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

వైరస్‌ బారిన 11,200 మంది పోలీసులు 
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దేశంలో మరే రాష్ట్రంలో చేయనన్ని టెస్టులు చేస్తూ రోగులను గుర్తించి వ్యాప్తిని అరికడుతోంది. ఇంతచేస్తున్నా పోలీసుల్లోనే 11,200 మంది వైరస్‌ బారినపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులదీ అదే పరిస్థితి. బ్యాలెట్‌ పేపరు ద్వారా జరిగే స్థానిక ఎన్నికల్లో వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గేవరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులను రక్షించుకునేందుకు కోర్టుకైనా వెళతామన్నారు. చాలా యూరప్‌ దేశాల్లో సెకండ్‌వేవ్‌ మొదలైంది. మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. మనదేశంలో కూడా ఆ ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.    

మరిన్ని వార్తలు