బంతి భోజనం వద్దు.. బఫేనే ముద్దు!

5 Jan, 2021 09:02 IST|Sakshi
విజయవాడలోని ఓ హోటల్‌లో నిల్చునే టిఫిన్‌ చేస్తున్న ప్రజలు

ప్రజల ఆహారపు శైలిలో మార్పు

ఇంటా, బయటా నిల్చునే తినడానికి ఆసక్తి

అందుకనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఏర్పాట్లు

సాక్షి, అమరావతి బ్యూరో: ఉరుకుల పరుగుల యుగంలో జనం ఆహరపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయానికి విలువ పెరగడంతో వేచి ఉండే ధోరణిని మానుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలలో టేబుళ్లు వేసి కూర్చుని తినే ఏర్పాట్లు చేసేవారు. హోటళ్లలోనూ అలాంటి సదుపాయాలే ఉండేవి. కాలక్రమంలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూర్చుని తినడానికి బదులు నిల్చుని తినే సంస్కృతి విస్తృతమైంది. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్లు, వేడుకల్లో బఫే (నిల్చుని తినడం) భోజనాలే సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు ఈ బఫే సంస్కృతి ఉన్నత వర్గాల కుటుంబాల్లోనే ఉండేది. కొన్నేళ్లుగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనూ సర్వసాధారణమైంది. 

కోవిడ్‌ నేర్పిన కల్చర్‌.. 
మరోవైపు కోవిడ్‌ నేపథ్యంలో ఇలాంటి బఫే కల్చర్‌కు ప్రాధాన్యత పెరిగింది. భౌతిక దూరం పాటించాల్సి రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, నైట్‌ఫుడ్, స్ట్రీట్‌ ఫుడ్‌ జంక్షన్లలో కుర్చీల విధానానికి దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల పంక్తి భోజనాల్లోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ బఫే టిఫిన్లు, భోజనాలకు వీలుగా టేబుళ్లు ఏర్పాటవుతున్నాయి. విజయవాడ నగరంలో ఇలాంటివి అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి. వీటిలో నచ్చిన వాటికి ఆర్డరిచ్చి నిల్చునే తింటున్నారు. గతానికి భిన్నంగా వేచి ఉండే అలవాటుకు స్వస్తి పలుకుతున్నారు.  

విజయవాడలో ఇలా.. 
విజయవాడలో కొత్తగా ప్రారంభించే రెస్టారెంట్లలో వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాక రోడ్డు పక్కన, చిన్న చిన్న షాపుల్లోనూ ఏర్పాటు చేస్తున్న టిఫిన్‌ దుకాణాల బయట ఇలాంటివే ఉంటున్నాయి. కనీసం నాలుగైదు టేబుళ్లు వేస్తున్నారు. నగరంలో ఇలాంటి వాటికే ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. యువతీ యువకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగులు వీటివైపు ఆకర్షితులవుతున్నారు. మారిన ధోరణికిది దర్పణం పడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్ల వారికి ఇలాంటి స్టాండింగ్‌ టేబుళ్ల ఏర్పాటు వల్ల జాగా బాగా కలిసొస్తోంది. పైగా పెట్టుబడి, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతోంది.

ఆరోగ్యదాయకం కాకపోయినా..  
నిల్చుని తినడం, మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తలెత్తుతాయని, ద్రవాల సమతుల్యత దెబ్బతింటుందని యోగ, ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అదే కూర్చుని తిన్నా, తాగినా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని, నాడీ వ్యవస్థ మెరుగు పడుతుందని వీరు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు