పవన్‌.. గో బ్యాక్‌ 

17 Oct, 2022 03:15 IST|Sakshi
విశాఖ పోర్టు స్టేడియం వద్ద పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న ప్రజలు

పెద్దఎత్తున నినదించిన విశాఖ వాసులు.. రాజధానిగా వద్దనటంపై నిరసనలు

ఉదయాన్నే పోర్టు స్టేడియం వద్దకు తరలివచ్చిన స్థానికులు

వారికి మద్దతుగా నిలిచిన జేఏసీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

పవన్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదంటూ నినాదాలు

పరిస్థితి ఉద్రిక్తం.. కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తప్పనిసరై ‘జనవాణి’ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న పవన్‌కల్యాణ్‌

తమ కార్యకర్తలను విడుదల చేసేదాకా విశాఖలోనే ఉంటానని ప్రకటన

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖలో చుక్కెదురైంది. ఊహించని రీతిలో స్థానికుల నుంచి నిరసనల సెగ తగిలింది.  ‘పవన్‌ గో బ్యాక్‌’ అంటూ యావత్తు విశాఖ నినదించింది. ఆదివారం ఉదయాన్నే పవన్‌ ‘జనవాణి’ నిర్వహించనున్న పోర్టు స్టేడియం ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానిక మహిళలు, నాన్‌ పొలిటికల్‌ జేఏసీ మద్దతుదారులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

వపన్‌ కల్యాణ్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హతలేదని నినదించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయినా నిరసనకారులు అక్కడికి వస్తూనే ఉండటంతో.. పరిస్థితి అనుకూలంగా లేదని భావించిన పవన్‌ కల్యాణ్‌.. తన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఒక దశలో విశాఖ నుంచి తిరిగి వెళ్లిపోవటానికి సిద్ధమై.. మళ్లీ అంతలోనే మనసు మార్చుకున్నారు. 
ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సిగ్నల్‌ వద్ద మానవహారంగా ఏర్పడిన స్థానికులు  

విశాఖ గర్జనను పక్కదారి పట్టించాలని..
వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం జోరు వానలోనూ విశాఖ గర్జన విజయవంతం అయిన నేపథ్యంలో.. తమ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించతలపెట్టిన పోర్టు స్టేడియం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి.. పవన్‌ కల్యాణ్‌ గో బ్యాక్‌..’ అంటూ నినదించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా, నిరసన సెగ తప్పదని స్పష్టం చేశారు.

వీరికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్ర జేఏసీ నేతలతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ కేకే రాజు నేతృత్వంలో పలువురు నేతలు భారీగా అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఫలితంగా తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను నిరసిస్తూ జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
రోడ్డుపై పడుకుని మహిళల నిరసన  

తమ కార్యకర్తలు బయటకు వచ్చే వరకూ విశాఖ వదిలి వెళ్లనని నోవాటెల్‌ హోటల్‌లోనే ఉండిపోయారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు.. వికేంద్రీకరణకు జనసేన పూర్తిగా వ్యతిరేకమని, విశాఖ పరిపాలన రాజధాని కావడం ఏ మాత్రం ఇష్టం లేదని మరోసారి ప్రత్యక్షంగా స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు