Elephants: కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఏనుగులు

20 May, 2021 05:41 IST|Sakshi
జీడితోటల్లో ఏనుగులు

జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగులు

అడవుల్లో కొరవడిన ఆహారం, నీరు 

పంటలను ధ్వంసం చేస్తున్న వైనం

నష్ట పోతున్నామంటున్న గిరిజనం

ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి సుమారు 14 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు గిరిజనులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 2007లో సీతంపేట మన్యంలోకి వచ్చిన 11 ఏనుగులు అప్పటి నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాయి. వీటిలో ఏడు చనిపోగా మిగిలిన నాలుగు ఇక్కడే తిష్ట వేశాయి. వీటి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోతున్నారు. వీటి దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా వీటి నుంచి శాశ్వత పరిష్కారం లభించలేదు. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు లేక జనావాసాల్లోకి వచ్చేస్తుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

సీతంపేట: ఏనుగుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని, సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోనే గత 14 సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో భామిని, సీతంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లోకి తరచూ వస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

తగ్గిన అటవీ విస్తీర్ణం
 2007లో ఏనుగులు సీతంపేట మన్యంలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి వివిధ రకాల చెట్లకు నిలయమై ఉండేవి. ఇప్పుడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. అభివృద్ధి పేరిట అటవీ ప్రాంతంగుండా రహదారులు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొండపోడు వ్యవసాయం కోసం అడవులను కాల్చివేస్తున్నారు. దీంతో మూగజీవాలకు నిలువనీడలేక మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. ఒడిశాలోని లకేరీ అటవీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లను నరకడం, అడవుల్లో జనసంచారం పెరగడంతో అక్కడ ఉండే ఏనుగులు జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చేస్తున్నాయి. వెదురు, రావి, వెలగ, మర్రి, చింత, ఇతర పండ్ల జాతుల చెట్లు, దట్టమైన పచ్చిక బయళ్లు ఏనుగులకు ఆహారం. కానీ అడవుల్లో ఈ జాతులు మొక్కలు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది. దీంతో గిరిజనులు పండించే పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు పైగా పంటలను నాశనం చేశాయని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు వద్దకు నీటి కోసం వచ్చిన ఏనుగులు 

నీరే ప్రధానం..
ఏనుగులకు నీరు చాలా అవసరం. వాటి చర్మం మందంగా ఉంటుంది. వేడిని తట్టుకోవడానికి తరుచుగా నీరు తాగడం, మీద చల్లుకోవడం చేస్తుంటాయి. భరించలేని పరిస్థితుల్లో బురద మట్టిని సైతం దేహానికి పూసుకుంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వాటికి కావాల్సిన మేత కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు గతంలో ఏనుగు సంచరించే అటవీ ప్రాంతాన్ని గుర్తించి నీటి కుంటలు నిర్మించారు. అయితే అనంతరం వీటి నిర్వహణ గాలికి వదిలేయడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో వేసవి ఆరంభంలోనే జనావాసాలకు సమీపంలోకి వచ్చేస్తున్నాయి.  సీతంపేట–భామిని సరిహద్దు ప్రాంతంలో చెరువు ఉండడంతో ప్రస్తుతం అక్కడకు వచ్చి ఏనుగులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.  

శాశ్వత పరిష్కారాలు లేవా?
ఏనుగులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. వేసవిలోనూ వాటికి మేత, నీరు లభ్యమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏనుగుల నియంత్రణకు రెండేళ్ల క్రితం కందకాలు తవ్వడం వంటివి చేసినప్పటికీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. కందకాల్లో గిరిజనులకు చెందిన ఆవులు, మేకలు వంటివి పడి చనిపోయిన సందర్భాలు ఉండడమే కారణం. ఏనుగులను ఇక్కడ నుంచి తిరిగి లకేరి అటవీ ప్రాంతానికి తరలించాలని జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒడిశా కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో సాధ్యం కావడం లేదు.  

జీపీఎస్‌తో ట్రాక్‌ చేస్తున్నాం
ఏనుగులు ఎక్కడ సంచరిస్తున్నాయనేది జీపీఎస్‌తో ట్రాక్‌ చేస్తున్నాం. అవి ఎటువైపు పయనిస్తున్నాయనేది తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 14 మంది ట్రాకర్లు ఉన్నారు. ఏనుగులు గ్రామాలవైపు రాకుండా వారు చర్యలు చేపడతారు. ఏనుగుల కారణంగా పంటనష్టం వాటిల్లుతున్న మాట వాస్తవం. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హార్టీకల్చర్, వ్యవసాయశాఖలు ఏనుగులు తొక్కేసిన పంటల నష్ట పరిహారం అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారంగా పరిహారం కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం.  
– గుండాల సందీప్‌కృపాకర్, డీఎఫ్‌వో

జీడి, మామిడి పంటలకు నష్టం
కొన్ని రోజులుగా మా ప్రాంతంలోనే ఏనుగులు సంచరిస్తూ జీడి, మామిడి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి.  ఏనుగులు ఏ మూల నుంచి దాడి చేస్తాయోననే భయంతో కొండపోడు పనులకు వెళ్లడం లేదు.
– ఎన్‌.ఆదినారాయణ, చిన్నబగ్గ కాలనీ
 
సమస్య పరిష్కరించాలి
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు కష్టపడి సాగు చేస్తున్న పంటలను ఏనుగులు నాశనం చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వీటిని నియంత్రించడంలో అటవీశాఖ విఫలమైంది. ఇప్పటికైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇక్కడ నుంచి ఒడిశా అటవీ ప్రాంతానికి తరిమివేయాలి. 
– పి.సాంబయ్య, గిరిజన సంఘం నాయకుడు 

మరిన్ని వార్తలు