ఏపీ: మరో 6 లక్షల మంది మహిళలకు శాశ్వత ‘జీవనోపాధి’

12 Jul, 2021 08:26 IST|Sakshi

లాభదాయక వ్యాపారాల్లో మహిళలకు తోడ్పాటు అందించేలా 14 సంస్థలతో సర్కారు ఒప్పందాలు 

మంత్రుల కమిటీ సమక్షంలో ఎంవోయూలపై నేడు సంతకాలు చేయనున్న అధికారులు

గత ఏడాది 3 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి

ఇటీవలే మహిళలకు రెండో విడత ‘చేయూత’ ద్వారా రూ.4,395 కోట్లు పంపిణీ 

సెప్టెంబర్‌లో ఇచ్చే ‘ఆసరా’తో కలిపి ఈ ఏడాది మహిళల చేతికి అందే మొత్తం రూ.11 వేల కోట్లు

ఆ సొమ్మును శాశ్వత జీవనోపాధి పనుల్లో పెట్టుబడి పెట్టించేందుకు చర్యలు 

సాక్షి, అమరావతి: లాభదాయక వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాటు అందించడం ద్వారా  శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు మరో 14 కా ర్పొరేట్‌ సంస్థలు, ఎన్‌జీవోలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమక్షంలో సోమవారం సాయం త్రం ఆయా సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు.

మహీంద్ర టాప్‌ గ్రీన్‌ హౌసె స్, ఈ–కామర్స్‌ వ్యాపార సంస్థల్లో ఒకటైన ‘అజి యో’ బిజినెస్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎన్‌ఐ–ఎం ఎస్‌ఎంఈ), ఫౌండేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ వేల్యూ చైన్స్, హీఫెర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తో భాగస్వామిగా ఉన్న గ్రామీణ వికాస కేంద్రం (సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోన్నాయి. పేద మహిళల శాశ్వత జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం గత ఏడాది హిందుస్థాన్‌ లీవర్, ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌ (పీ అండ్‌ జీ), ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్‌ మార్కెట్‌కూ వీలు 
వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా మహిళలకు ఇచ్చే నగదును   వివిధ వ్యాపార మార్గాల్లో పెట్టుబడికి వినియోగించుకునే అవకాశం కల్పించ డం ద్వారా ఈ ఏడాది కనీసం 6 లక్షల మహిళల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులు కల్పించాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా మహిళలు చేతివృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమెడ్‌ దుస్తుల విక్రయానికి ఈ–కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్‌ మార్కెట్‌లో అవకాశాలు కల్పిస్తారు. అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, వసతుల కల్పన ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగాల్లోనూ లాభదాయకత పెంచడం వంటి చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వం అందించిన అదనపు తోడ్పాటుతో కిరాణా దుకాణాలు వంటివి ఏర్పాటు చేసుకుని శ్వాశత జీవనోపాధి పొందుతున్నారు.

ఈ ఏడాది మహిళల చేతికి రూ.11 వేల కోట్లు
వైఎస్సార్‌ చేయూత పథకం కింద వరుసగా రెండో ఏడాది కూడా జూన్‌ 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 23.44 లక్షల మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.4,395 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన విషయం విదితమే. మరోవైపు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద వరుసగా రెండో సంవత్సరం కూడా వచ్చే సెప్టెంబర్‌లో మరో రూ.6 వేల కోట్లకు పైగా సొమ్మును పొదుపు సంఘాల మహిళలకు  ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతోంది. ఈ రెండు పథకాల ద్వారా దాదాపు రూ.11 వేల కోట్లు మహిళల చేతికి అందుతుండగా.. ఆ డబ్బులను వ్యాపార, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకునేలా ప్రభుత్వం అదనపు తోడ్పాటు అందజేయనుంది.

పారిశ్రామికవేత్తలుగానూ తీర్చిదిద్దేలా.. 
ఈ–కామర్స్‌ సంస్థ అజియో బిజినెస్‌ సంస్థతో ఒప్పందం ద్వారా మహిళలు చేతి వృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులతో పాటు రెడీమేడ్‌ దుస్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం కలుగుతుంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 90 వేల మంది మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక గ్రీన్‌ హౌసెస్‌ వ్యవసాయ పద్ధతులతో అధిక ఫలసాయం పొందడం, నాణ్యమైన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో మహీంద్ర టాప్‌ గ్రీన్‌ హౌసెస్‌ సంస్థ మహిళలకు తోడ్పాటు అందిస్తుంది.

ఈ సంస్థ ద్వారా 65 వేల మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ సంస్థ ద్వారా కుటీర పరిశ్రమల ఏర్పాటులోనూ మహిళలకు తోడ్పాటు అందించనున్నారు. ఈ సంస్థ తోడ్పాటుతో 1,300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు