మీకు తెలుసా​..?: గణేష్‌ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి

26 Aug, 2022 21:32 IST|Sakshi

ముందస్తు అనుమతులు తప్పనిసరి 

నిబంధనలు విధిగా పాటించాలి 

పోలీసులకు సహకరించాలి

సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్‌ మండపాల ఏర్పాటుకు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  కచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. 
బలవంతపు చందాలు, వసూళ్లు చేయరాదు. దర్శనాల టికెట్లు పెట్టకూడదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్‌ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు. 
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీలైనంత మేరకు ప్లాస్టర్‌ ఆఫ్‌ కృత్రిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను కొనుగోలు చేయవద్దు. మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి. 

విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి.  
దీపారాధనలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 
శబ్దకాలుష్యం అరికట్టేందుకు పాల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నియమాలు విధిగా పాటించాలి. పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్‌ దాటి శబ్దం రాకూడదు. బాక్స్‌ టైపు స్పీకర్లను మాత్రమే వినియోగించాలి. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. 
కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి. 

మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలిగించకూడదు. విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్‌ చేయకూడదు. 
ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా, మందుగుండు సామగ్రి కాల్చినా చర్యలు తప్పవు. 
వినాయక నిమజ్జన ఊరేగింపు ప్రారంభించి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. 
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి. 

మరిన్ని వార్తలు