ఏఎన్‌యూలో ఉర్దూ ప్రత్యేక విభాగం ఏర్పాటు

16 Jun, 2022 18:42 IST|Sakshi

ముస్లిం వర్గాల వినతులతో చొరవ చూపిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

మైనార్టీల ఉన్నత విద్యకు బాటలు

దీర్ఘకాల కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం విద్యార్థి లోకం

పరిశీలనలో అరబిక్‌ విభాగం ఏర్పాటు

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మేలు బాటలు వేస్తోంది. మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తించింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉర్దూ కోర్సు విభాగం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి మరో ముందడుగు వేసింది. అంతేగాకుండా అరబిక్‌ కోర్సును ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఏఎన్‌యూ(గుంటూరు): ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం, యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. ముస్లిం యువతీయువకులు అధికంగా అరబిక్, ఉర్దూ భాషల్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అరబిక్, ఉర్దూ భాషల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ప్రత్యేకంగా విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ముస్లిం యువతీయువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు చేపడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది.  

పదేళ్లుగా ముస్లిం సంఘాలు వినతి 
రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం ముస్లిం వర్గాల వినతులను పట్టించుకోలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంఘాల వినతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాను కలిసి విన్నవించుకోగా ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్‌యూ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూలో ఉర్దూ కోర్సు నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా కార్యాచరణ పూర్తి చేసింది.  

పరిశీలనలో అరబిక్‌ కోర్సు వినతులు 
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేసి అరబిక్‌ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను విన్నవించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

ముస్లిం మైనార్టీల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చింది 
రాష్ట్రంలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉర్దూ, అరబిక్‌ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రంలో ఈ కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల ముస్లిం యువతీయువకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
– డాక్టర్‌ మస్తాన్‌ ఆలీ, ముస్లిం సంఘాల జేఏసీ సభ్యుడు 

ముస్లిం సంఘాల హర్షం
ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ప్రారంభించడం, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అరబిక్‌ విభాగ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, ఉర్దూ భాషను ఐచ్చిక ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మదరసాలలో ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థులతోపాటు, అరబిక్, ఉర్దూ బోధకులుగా స్థిరపడాలనుకునే వారికి, ధార్మిక పండితులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు